సంక్రాంతికి ఇప్పట్నుంచే పోటీ మొదలైంది. ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ అందరికంటే ముందు కర్చీఫ్ వేసింది. ఆ తర్వాత చిరంజీవి-బాబి కాంబోలో వస్తున్న సినిమాను సంక్రాంతికి ప్రకటించారు. ఈ రెండు సినిమాల మధ్యలో విజయ్ తెలుగు డెబ్యూ మూవీ వారసుడును కూడా సంక్రాంతికే తీసుకొస్తున్నట్టు స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇప్పుడీ పోటీ మరింత పెరిగింది.
సంక్రాంతికి ఈ సినిమాలతో పాటు బాలయ్య సినిమా కూడా బరిలో నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఇప్పటివరకు టైటిల్ తో పాటు విడుదల తేదీని ప్రకటించలేదు.
ఈ సినిమా కోసం 2-3 టైటిల్స్ అనుకుంటున్నారు. అందులో ఒక టైటిల్ ను ఆల్రెడీ ఫిక్స్ చేశారు. కాకపోతే సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ అయిన తర్వాత, సంక్రాంతి రిలీజ్ అంటూ టైటిల్ పోస్టర్ ను విడుదల చేసే ఉద్దేశంతో ఇంకా టైటిల్ ప్రకటించలేదు.
ప్రస్తుతం ఇదే అంశంపై యూనిట్ లో తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. నిజానికి సంక్రాంతికి రావాలనుకుంటే అంత ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే, బాలయ్యకు సంక్రాంతి బరిలో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. కాకపోతే ప్రతిసారి ఆయన ముహూర్తాలు, జాతకాలు చూస్తారు. ఈసారి కూడా అదే పనిలో ఉన్నారు. అందుకే లేటు అవుతోంది. లేదంటే ఈపాటికి ప్రకటన వచ్చి ఉండేది.