దర్శకుడు అనీల్ రావిపూడి, హీరోయిన్ మెహ్రీన్ మధ్య అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. మెహ్రీన్ ను తన లక్కీ మస్కట్ గా ఫీల్ అవుతుంటాడు రావిపూడి. రాజా ది గ్రేట్, ఎఫ్2, ఎఫ్3.. ఇలా వీలుచిక్కినప్పుడల్లా మెహ్రీన్ ను రిపీట్ చేస్తుంటాడు. ఇప్పుడు బాలయ్య సినిమా కోసం మెహ్రీన్ ను మరోసారి రిపీట్ చేయాలని అనీల్ రావిపూడి భావిస్తున్నాడట.
అతడి సెంటిమెంట్స్ అతనివి. వాటిని కాదనలేం. కానీ బాలయ్య లాంటి సీనియర్ మోస్ట్ సరసన మెహ్రీన్ సెట్ అవుతుందా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ గా మారింది. దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది.
తనకంటే వయసులో ఎంత చిన్న హీరోయిన్ తోనైనా స్క్రీన్ పై రొమాన్స్ చేయడానికి బాలయ్య రెడీ. గతంలో ఎన్నో సినిమాల్లో ఇది ప్రూవ్ అయింది కూడా. అయితే ఈసారి సందర్భం వేరు. అనీల్ రావిపూడి సినిమాలో 50 ఏళ్ల వయసున్న తండ్రి పాత్రలో బాలయ్య కనిపించబోతున్నాడు.
ఈ తండ్రి పాత్రకు శ్రీలీల లాంటి కూతురును కూడా సెట్ చేశాడు దర్శకుడు. తండ్రి-కూతురు ఎమోషన్స్ తో సాగే ఈ సినిమాలో, తండ్రి పాత్రకు హీరోయిన్ గా మెహ్రీన్ ను తీసుకుంటే, ఆమె స్క్రీన్ పై సెట్ అవుతుందా అనేది అందరి డౌట్.
అనీల్ రావిపూడి అడిగితే మెహ్రీన్ కచ్చితంగా చేస్తుంది. అందులో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. రామ్ చరణ్ అడిగితే చిరంజీవి పక్కన కాజల్ చేయలేదా ఏంటి! ఇది కూడా అలాంటిదే. ఏం జరుగుతుందో చూడాలి.