కలకలం రేపిన బంజారాహిల్స్ డ్రగ్స్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. జాతీయ పార్టీల నాయకుల పిల్లలే డ్రగ్స్, గంజాయి మత్తులో ఊగుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి మేనల్లుడు, బీజేపీ నేత కుమారుడు ఉన్నారన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ లో ముంచుతోంది.. కేవలం బీజేపీ, కాంగ్రెస్ నాయకులేనని ఆరోపించారు.
పబ్ నిర్వాహకులు బీజేపీ నాయకురాలు ఉప్పల శారద కుమారుడు అభిషేక్ అని తేలిందన్నారు బాల్క సుమన్. ఆమె 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేశారని వివరించారు. అభిషేక్ బీజేపీ కండువా కప్పుకొని ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారని అందుకు సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు బాల్క సుమన్.
బండి సంజయ్, రేవంత్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. లేదంటే తగినరీతిలో ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. భవిష్యత్తులో ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు బయటకు వస్తాయని అనుకుంటున్నామన్నారు.
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ రివ్యూలు చేశారని.. ఈ కారణంగానే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని చెప్పారు బాల్క సుమన్. ఈ కేసులో ఎవర్నీ వదిలిపెట్టొద్దని పోలీసులను కోరుతున్నానన్నారు. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందేనని.. డ్రగ్స్ నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ తరఫున డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ సీవీ ఆనంద్ ను కోరుతున్నామని తెలిపారు.