ధాన్యం సేకరణ కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని చెప్పారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. రాష్ట్ర రైతులను ఇబ్బంది పెట్టి బీజేపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. కేంద్రం తన బాధ్యతలను విస్మరించి దుర్మార్గంగా రైతుల పొట్ట కొడుతోందన్నారు.
తెలంగాణ రైతులను, ప్రజలను అవహేళన చేస్తూ కించపరుస్తూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాటలను ఖండించాల్సిన నాయకులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు బాల్క సుమన్. ధాన్యం సేకరణపై పరిష్కారం దిశగా తాము ఆలోచిస్తుంటే బీజేపీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని పీయూష్ గోయల్ దెబ్బతీశారని విమర్శించారు. మొత్తం ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్రంపై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ నేతలు ధాన్యం సేకరణ అంశంపై ప్రధాని మోడీపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. వన్ నేషన్ వన్ ప్రోక్యూర్ మెంట్ పాలసీ ఎందుకు ఉండొద్దని ప్రశ్నించారు.
వరి పండించండి అని బండి సంజయ్ గతంలో రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదా అని నిలదీశారు బాల్క సుమన్. ఇప్పుడు ఆయన నిజస్వరూపం బయటపడిందని సెటైర్లు వేశారు. ఇప్పటికైనా చిల్లర మాటలు మానుకోవాలని.. రైతులతో పెట్టుకున్నోడు ఎవరూ బాగుపడలేదన్నారు. పీయూష్ గోయల్ కళ్ళు నెత్తికెక్కాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు బాల్క సుమన్.