స్క్రోలింగ్ కోసం వెంపర్లాడిన రోజులు మరచారా, బాల్కా - Tolivelugu

స్క్రోలింగ్ కోసం వెంపర్లాడిన రోజులు మరచారా, బాల్కా

నర్శింహ, జర్నలిస్ట్

, స్క్రోలింగ్ కోసం వెంపర్లాడిన రోజులు మరచారా, బాల్కామ నాయకుడు వెళ్లే దారిలో వెళ్లకపోతే ఇబ్బంది అవుతుంది అనుకున్నారేమో ఎమ్మెల్యే బాల్క సుమన్. అందుకే ఒక ప్రధాన మీడియా సంస్థను పట్టుకొని ‘మీ అంతు చూస్తా’ అంటూ బెదిరించాడు. 8 సంవత్సరాల క్రితం తన పేరు మీద చిన్న స్క్రోలింగ్ పెట్టమని ఓయూలో రిపోర్టర్ల చుట్టూ తిరిగిన రోజుల్ని బహుశా బాల్క సుమన్ మరచిపోయి ఉంటారేమో! అందుకే ఇవాళ ఓ ప్రధాన పత్రికను బెదిరించే స్థాయికి వెళ్లారు. ఎప్పుడైనా నేతలు తమ అవసరం కోసం బహిరంగంగా మాట్లాడకుండా చిట్‌చాట్ పేరు చెప్పి తాము చెప్పాల్సింది చెబుతూ వుంటారు. అదే చాలాసార్లు పత్రికలకు ప్రధానవార్త అవుతోంది. ఇప్పుడు కూడా ఒక వార్తా పత్రిక రిపోర్టర్ అదే పని చేశాడు. బాల్క సుమన్, మంత్రి పువ్వాడ అజయ్ ఇద్దరు మాట్లాడుకున్నదే వార్తగా వేశాడు. పోనీ అదేదో సుమన్ ఇంట్లో కానీ, పువ్వాడ అజయ్ ఇంట్లో కానీ మాట్లాడుకున్నదేదైనా అయితే తప్పే, కానీ వాళ్ళు మాట్లాడుకున్నది టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో.. అది కూడా మీడియా వాళ్ళ ముందు. మరి దాన్ని వార్తగా వేస్తే సుమన్‌కు కోపం వచ్చింది. మీ అంతు చూస్తా అని బెదిరించేంత. ఎప్పుడూ మీడియాలో కనపడాలని అనుకునే సుమన్‌కు ఆరోజు మాట్లాడింది కూడా మీడియాలో రావాలనే అనుకున్నారు. వచ్చినందుకు సంతోషించారు కానీ, అది కాస్తా యువరాజు నుంచి చివాట్లు పెట్టేలా సీన్ మారిపోయేసరికి అతన్ని ఏమనలేక ఆ కోపాన్ని మీడియాపై చూపించినట్టుగా అనిపిస్తోంది. సుమన్, పువ్వాడ మధ్య జరిగిన సంభాషణ టీఆర్ఎస్‌లో ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి తెలిసేలా చేసింది. టీఆర్ఎస్‌లో ఎవరికి ఏ పదవి ఎలా వస్తుందో వాళ్ళ ఇద్దరి సంభాషణను బట్టీ అర్థం అవుతుంది, అక్కడే కేటీఆర్‌కు కూడా కోపమొచ్చింది. దాంతో సుమన్‌ను కాస్త గట్టిగానే తిట్టడంతో ఆ కోపాన్ని సుమన్  రిపోర్టర్లపై చూపించారు. మీడియాను అంటే ఏమవుతుంది లే, ఇప్పటికే 90 శాతం మీడియాను మా కోటలో బందీగా కట్టేసుకున్నాం, అక్కడక్కడా అరకొరా మిగిలిపోయిన మీడియాను కూడా బెదిరించి లొంగదీసుకోవాలి అనేది టీఆర్ఎస్ ఆలోచనగా కనిపిస్తోంది. పార్టీ లీడర్స్ అందరూ అదే ఫాలో అవుతున్నారు. గత ప్రభుత్వంలో టీవీ9 ప్రసారాలను ఆపేసి, ఆ తరువాత ఆ ఛానల్‌ను ఎలా కోటలో కట్టేసుకున్నారో అందరికి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ అసమర్థతను, ప్రజావ్యతిరేక విధానాలను ఎత్తి చూపే ఛానల్స్ లేవు. కనీసం చిట్‌చాట్‌లు అయినా రాసే ఒకటీ రెండు మీడియా సంస్థలను కూడా భయపెట్టి.. అవి కూడా రాయకుండా చేయాలనేది ప్లాన్‌గా కనిపిస్తోంది. ఏమైనా సుమన్.. మీరు గతాన్ని మర్చిపోతే ఎలా ? ఇదే మీడియా వల్ల మీరు తెలంగాణ సమాజానికి పరిచయం అయ్యారు. ఎంపీ, ఎమ్యెల్యేగా టికెట్ రావడానికి, మీరు గెలవడానికి మీకు మీడియా కావాలి. మీరు పాలిటిక్స్‌లో ఇలానే ఎదగాలన్నా మీకు మున్ముందు కూడా మీకు అవసరం ఉంటది. కానీ, మీడియాని బెదిరించి లొంగదీసుకొవాలని అనుకుంటున్నారే, అది మాత్రం మూర్ఖత్వమే అవుతుంది. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీడియాని  బెదిరిస్తున్నారు. రేపు మీరు ఓడిపోయాక మీడియా అంటే ఏంటో, దాని విలువ ఏంటో బాగా తెలుస్తుంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp