జనగామ జిల్లాలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. కొన్నాళ్లుగా విద్యార్థుల సమస్యలపై జిల్లా అధ్యక్షుడు అభిగౌడ్ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాకు వెళ్లిన వెంకట్ ను పోలీసులు అడ్డుకున్నారు.
కేజీ టు పీజీ ఉచితంగా విద్య అందిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ.. ఏళ్లు గడుస్తున్నాయే గానీ దానిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. పైగా ప్రైవేట్ స్కూళ్లు ఫీజుల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అభిగౌడ్ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
అభికి మద్దతుగా పోరాటం సాగించేందుకు జనగామ వెళ్లారు వెంకట్. అయితే.. పోలీసులు చౌరస్తాలో అరెస్ట్ చేసి లింగాల గణపూర్ పీఎస్ కు తరలించారు. ఇది అక్రమ అరెస్ట్ అని ఎన్‌ఎస్‌యూఐ నేతలు మండిపడుతున్నారు.
ప్రైవేట్ దోపిడీపై ప్రశ్నించడమే తప్పయిందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకట్ ను ఎందుకు అదుపులోకి తీసుకున్నారని మండిపడుతున్నారు. అభిగౌడ్, ఇతర జిల్లా నాయకులని జనగామ టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.