ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పై దొంగతనం కేసు నమోదైంది. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఓ గాడిదను దొంగతనం చేసినట్టు అందిన ఫిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేసినట్టు కరీంనగర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. రంగనాయకుల గుట్ట దగ్గరున్న సమ్మక్క, సారలమ్మ దర్శనం చేసుకుని వస్తుండగా జమ్మికుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
కేసీఆర్ బర్త్ డే సందర్భంగా నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అందులో భాగంగా.. బల్మూరి వెంకట్ గాడిదతో జన్మదిన వేడుకలను నిర్వహించారు. అయితే.. ఆ గాడిదను దొంగిలించి వేడుకలు చేశారంటూ కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన ఓ టీఆర్ఎస్ నేత ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
గాడిద ఓ సాధు జంతువు. బడుగు బలహీన వర్గాలకు, సంచార జాతులకు ఆసరాగా పనిచేస్తోంది. అలాంటి గాడిదను దొంగతనం చేయడమే కాకుండా.. వారి స్వప్రయోజనాల కోసం.. దాన్ని హింసించి అవమానించినట్లు ఫిర్యాదు దారు పేర్కొన్నట్టు అడిషనల్ డీసీపీ తెలిపారు.
రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఈ చర్య ఉందన్నారు అడిషనల్ డీసీపీ. దీనిపై కేసు విచారణ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆ గాడిద ఎక్కడినుంచి తెచ్చాడు..? ఓనర్ ఎవరనే వివరాలు కూడా బల్మూరి వెంకట్ చెప్పడంలేదని అన్నారు అడిషనల్ డీసీపీ.