పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ఎట్టకేలకు ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నిజామాబాద్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను కలిశారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య బృందంతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
వివరాల్లోకి వెళ్తే.. బాసర ట్రిపుల్ ఐటీలో శుక్రవారం ఫుడ్ పాయిజన్ అయింది. మెస్ లో మధ్యాహ్నం ఎగ్ కర్రీ రైస్ తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన గంటన్నర తరువాత విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. 350 మందికి పైగా విద్యార్థులు స్వల్ప వ్యవధిలోనే వాంతులు, విరేచనాలతో హాస్టల్ గదుల నుంచి చికిత్స కోసం ట్రిపుల్ ఐటీలోని ఆస్పత్రికి తరలి వెళ్లారు.
తీవ్ర అస్వస్థతతో ఉన్నపలువురు విద్యార్థులను రెండు అంబులెన్సులలో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ట్రిపుల్ ఐటీలోని ఆసుపత్రిలో వైద్య సిబ్బంది తక్కువగా ఉండడం, అస్వస్థత చెందిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సత్వర వైద్య సేవలు అందించేందుకు గాను అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే భైంసా, ముధోల్ ఆసుపత్రుల నుంచి వైద్యాధికారులను, ఆరోగ్య సిబ్బందిని బాసర ట్రిపుల్ ఐటీకి తరలించింది.
అయితే.. ఫుడ్ పాయిజన్ విషయాన్నిఅత్యంత గోప్యంగా ఉంచేందుకు చూశారని.. మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఘటన మధ్యాహ్నం జరిగితే రాత్రికి గానీ విషయం బయటకు రాలేదు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు క్యాంపస్ లో నిరసనలు కొనసాగించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై తిరగబడ్డారు. ఇది జాతీయస్థాయిలోనూ చర్చనీయాంశమైంది. చివరకు ప్రభుత్వం దిగి వచ్చి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసనకు విరమించారు. ఇది జరిగి కొద్ది రోజులే అయింది. ఇప్పుడు సడెన్ గా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడం అనుమానాలకు తావిస్తోంది.
విషయం తెలిసిన వెంటనే బల్మూరి వెంకట్ విద్యార్థి నాయకులతో కలిసి నిజామాబాద్ ఆస్పత్రికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే.. పోలీసులు అతడ్ని రౌండప్ చేశారు. ఎటూ కదలకుండా చేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకట్. ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఎట్టకేలకు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ విద్యార్థులను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఎన్ఎస్ యూఐ నేతలు ఉన్నారు.