కర్ణాటకలో రానున్న రోజుల్లో హిజాబ్ పై నిషేధం ఎత్తేస్తారా ? ఈ విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జి. పరమేశ్వర సూచనప్రాయంగా చెప్పారు. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో హిజాబ్ పై గల నిషేధాన్ని ఎత్తివేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని, ప్రస్తుతం తాము ప్రజలకు ఇచ్చిన అయిదు ముఖ్యమైన హామీల అమలుపై దృష్టి పెట్టామని బుధవారం తెలిపారు. మరో మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఇది పాలసీకి సంబందించినదని, ప్రభుత్వం లీగల్ మార్గాలను కూడా పరిశీలిస్తుందని చెప్పారు.
లోగడ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో హిజాబ్ అంశం పెద్ద వివాదంగానే మారింది. విద్యా సంస్థల్లో యూనిఫారాలు తప్పనిసరి అని, ఇందులో హిజాబ్ ధారణకు మినహాయింపు ఏమీ లేదని ప్రభుత్వం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక హైకోర్టు కూడా ఇది సక్రమమేనని రూలింగ్ ఇచ్చింది.
దీంతో ముస్లిం విద్యార్థులు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లారు. కోర్టు తుది తీర్పు వచ్చేవరకు తరగతులకు హాజరు కావడానికి నిరాకరించారు. ఇప్పుడు హిజాబ్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది.
హిజాబ్ పై నిషేధం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్.ఏ. హారిస్ అన్నారు. ఈ బ్యాన్ ను ఎత్తివేసే అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో దీనిపై బ్యాన్ ఎత్తివేసే సూచనలు మెండుగానే ఉన్నాయని భావిస్తున్నారు.