చాలామంది ప్రభుత్వ డాక్టర్లు.. ప్రైవేట్ గా ప్రాక్టీస్ చేస్తుంటారు. రెండు చేతులా సంపాదిస్తుంటారు. కొందరైతే.. ప్రైవేట్ ప్రాక్టీస్ కే ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ ఆస్పత్రుల జోలికి రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడంపై నిషేధం విధించింది. తొలిదశలో కొత్తగా నియామకమయ్యే వారికి దీన్ని అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు మెడికల్ ఎడ్యుకేషన్ రూల్స్ ను సవరిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ జీవో కూడా విడుదల చేసింది.
ఈ జీవో ప్రకారం.. కొత్తగా చేరే వారు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వైద్యులకు మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
మరోవైపు ప్రైవేట్ ప్రాక్టీస్ ను బ్యాన్ చేసే ముందు ప్రభుత్వ వైద్యులకు ఇన్సెంటివ్స్ ను ప్రకటిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏకపక్షంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదనే వాదన తెరపైకి వస్తోంది.