శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎంపిక ప్రక్రియ పూర్తయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇటు ఏకగ్రీవంగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రకాష్ కు సీఎం కేసీఆర్, ఇతర నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీగా ఉన్న బండ ప్రకాష్ ని రాష్ట్రానికి రమ్మని ఆహ్వానించామని అన్నారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. తెలంగాణ ప్రజలకు ఆయన సేవలు చాలా అవసరమని.. ప్రకాష్ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని తెలిపారు. ముదిరాజ్ సామాజికవర్గ ఎదుగుదలకు బండా ప్రకాష్ ఎంతో కృషి చేశారని అన్నారు కేసీఆర్.
బండా ప్రకాష్ గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2021 నవంబర్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తర్వాత తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2021 డిసెంబర్ లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.
వరంగల్ కు చెందిన ప్రకాష్.. ముదిరాజ్ ల తరఫున పని చేశారు. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ గా వ్యవహరించిన విద్యాసాగర్ పదవీకాలం 2021 జూన్ లో ముగిసింది. ఆ తర్వాతి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేశారు. ఎవరూ పోటీకి నిలవకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.