బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవిపై రెంజర్ల రాజేష్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బాసర ఆలయ అర్చకులు, వేదపండితులు నిరసనకు దిగారు. అలాగే బాసరలో అమ్మవారి భక్తులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రెంజర్ల రాజేష్ ను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసన చేపట్టారు. రాజేష్‌పై పీడీ యాక్ట్ పెట్టాలని రాస్తారోకోకు దిగారు. కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాజేష్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో రెంజర్ల రాజేష్ పై ఎస్ఐ మహేష్ కు ఫిర్యాదు చేశారు. వీరికి మద్దతుగా కులమతాలకు అతీతంగా అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఒకే చోటుకు చేరుకుని తమ నిరసనను చేపట్టారు. మండల కేంద్రంలోని విద్యాసంస్థలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించి రోడ్డుపై బైఠాయించారు.
కాగా సరస్వతి అమ్మవారిని కించపరిచే విధంగా మాట్లాడిన రెంజర్ల రాజేష్ పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ బైంసా వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్న శివాజీ చౌక్ వద్ద బైఠాయించి పలువురు నిరసన వ్యక్తం చేశారు. రెంజర్ల రాజేష్ ను వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. దీంతో ప్రధాన రోడ్డు మార్గాన భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అనంతరం హిందూ సంఘాలు, రాజకీయ నాయకులు పలువురు కలిసి పోలీసులకు వినతి పత్రాన్ని అందించారు.
ఇటీవల అయ్యప్పస్వామిపై బైరి నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆయన పక్కనే రెంజర్ల రాజేష్ కూడా ఉన్నారు. వివాదం ముదిరిన సందర్భంలో బైరి నరేష్ కు సోషల్ మీడియాలో మద్దతు తెలిపి వివాదానికి మరింత ఆజ్యం పోశారు. ఈ క్రమంలోనే రాజేష్ పై చర్యలు తీసుకోవాలని అయ్యప్ప స్వాములు ఆయన ఇంటి ముందు ఆందోళన చేశారు.