- బిక్నూర్ జాతీయ రహదారిపై ఉద్రిక్తత
ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు వెళుతున్న బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. బాసరలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కామారెడ్డి జిల్లా బిక్నూర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు, బిజెపి కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.
బిక్నూర్ జాతీయ రహదారిపై బిజెపి శ్రేణులు, పోలీసులకు మధ్య జరిగిన వాగ్వాదంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పోలీసుల తీరును నిరసిస్తూ.. పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు, మహిళలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మరోవైపు పోలీసుల లాఠీచార్జ్ లో గాయపడ్డ సదాశివపేట ధర్మారావుపేట్ ఎంపీటీసీ మహిపాల్ యాదవ్ ను ఆసుపత్రికి తరించారు. విద్యార్థుల తరఫున పోరాటం చేస్తున్న తమపై పోలీసులు దమనకాండకు దిగుతున్నారంటూ బిజెపి శ్రేణులు మండిపడుతున్నాయి.
విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తే పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించడం ఏంటని ఫైరయ్యారు బండి సంజయ్. స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ను సిల్లీ ప్రాబ్లమ్స్ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ రెచ్చగడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళన చేస్తుంటే కరెంట్, నీళ్లు కట్ చేయడమేంటి? వాళ్లేమైన తీవ్రవాదులా అని ప్రశ్నించారు. కేసీఆర్ విద్యార్థులతో మాట్లాడితే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేదే కాదని వ్యాఖ్యానించారు. పేద విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరడం తప్పా..? అంటూ బండి మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.