కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర జోరుగా సాగుతోంది.17వ రోజు పాదయాత్రలో భాగంగా ఘన్పూర్లో రచ్చ బండ నిర్వహించిన ఆయన..గ్రామస్తుల సాదకబాధకాలను అడిగి తెలుసుకున్నారు.ఈసందర్భంగా గ్రామ ప్రజలు తమ సమస్యలను బండి సంజయ్ ముందు వెళ్లబోసుకున్నారు.
ఊరు పక్కనే నీళ్లు ఉన్నా ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదని,కల్యాణ లక్ష్మీ సాయం అందలేదని కొందరు ఆరోపించగా..వైద్య సదుపాయాలు అందక అష్టకష్టాలు పడుతున్నామని మరికొందరు, ఏటా పంటలు వేసి నష్టపోతున్నా ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఇంకొందరు తమ సమస్యలను బండికి ఎకరవు పెట్టారు.
గ్రామస్తుల సమస్యలు విన్న బండి సంజయ్..ఏ ఊరికి వెళ్లినా అందరూ ఇవే కష్టాలను చెప్పుకుంటున్నారని గుర్తు చేశారు.కేసీఆర్కు అధికారం అప్పగించి ప్రజలు మోసపోయారని అన్నారు.టీఆర్ఎస్ ఉన్నంత కాలం ఈ బాధలు తప్పవని చెప్పారు.ఎన్నికలు లేకపోయినా..ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే ఇంత దూరం వచ్చానని, పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు బండి సంజయ్.
తెలంగాణలో పేదోళ్ల రాజ్యం రావాలన్నదే ప్రధాని మోడీ లక్ష్యమని గ్రామస్తులకు వివరించారు.దేశంలో ఏ ఒక్క పేదవాడు ఇల్లు లేకుండా బాధపడకూడదనే ఉద్దేశంతోనే అందరికీ ఇళ్లను మంజూరు చేస్తుంటే..కేసీఆర్ వాటిని కట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.ఇందుకోసం తెలంగాణకు 3 లక్షల ఇండ్లు,రూ.10 వేల కోట్లు మంజూరు చేశారని స్పష్టం చేశారు.కేంద్రం ఇచ్చిన 3 లక్షల ఇళ్లను కేసీఆర్ కడితే..మరో 10 లక్షల ఇళ్లను ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.ఆ ఇళ్లను కట్టిన లెక్క చూపండి అంటే..ఇంతవరకు స్పందన లేదని ఆరోపించారు. కేసీఆర్ మాటలు చెబుతూ మోసం చేస్తున్నారని, ప్రజలు ఆయన నైజాన్ని గ్రహించాలి అని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నింటికీ కేంద్రమే నిధులిస్తోందని స్పష్టం చేశారు బండి. టాయిలెట్లు, శ్మశానవాటికలు, హరితహారం సహా అన్నింటికీ మోడీనే ఇస్తున్నాడని చెప్పారు. కేసీఆర్ ఇస్తున్న కిలో బియ్యానికి ఇక్కడ ఒక్క రూపాయి భరిస్తే..మోడీ ప్రభుత్వం ఒక్కో కిలో కు రూ.29లు భరిస్తోందని వివరించారు.వరి వేస్తే ఉరి వేసుకోవాల్సిందే…కేంద్రం కొనడం లేదని కేసీఆర్ కొత్త రాగం ఎత్తుకున్నారని, ఏవీ కొనడం లేదని రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్‌కు నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే ముక్కు నేలకు రాసి క్షమాపణ అడగాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. కేంద్రం 3 లక్షల ఇండ్లు ఇచ్చినా కట్టలేకపోయాను.. ఈసారి ఆ తప్పు చేయను అని చెప్పాలని అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇవ్వలేకపోయినందుకు, నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు, రుణమాఫీ చేయనందుకు ముక్కును నేలకు రాసి క్షమాపణ కోరాల్సిందేనన్నారు బండి.
డబ్బులిస్తే జనం ఓటేస్తారనే ధీమాలో కేసీఆర్ ఉన్నారని.. ప్రజలకు మోసపోవద్దని కోరారు ఆయన.