మంగళవారం సాయంత్రం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు భగీరథ్ అంశంపై తెగ చర్చ జరుగుతోంది. కాలేజీ యాజమాన్యం కూడా అతడ్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే భగీరథ్ తన లాయర్ తో కలిసి దుండిగల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.
భగీరథ్ మహీంద్రా యూనివర్సిటీలో మేనేజ్ మెంట్ కోర్సు చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం శ్రీరామ్ అనే విద్యార్థిని దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. అలాగే.. మరో వీడియో కూడా బయటకొచ్చింది. దీంతో వర్సిటీ క్రమశిక్షణా సంఘం ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా దుండిగల్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ విషయం మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చింది. దానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకే భగీరథ్ తన లాయర్ కరుణసాగర్ కలిసి పీఎస్ కు వెళ్లాడు. కేసు విషయాన్ని నిర్ధారించుకునేందుకు ఇక్కడికి వచ్చామని ఆ తర్వాత మీడియాకు వివరించారు లాయర్. కేసు ప్రాథమిక దశలోనే ఉందని పోలీసులు చెప్పారని అన్నారు. ఆధారాలు సేకరించిన తర్వాత.. పిలుస్తామని చెప్పినట్లు తెలిపారు.
విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని కరుణసాగర్ వెల్లడించారు. ఇటు బాధిత విద్యార్థి వీడియోపై స్పందిస్తూ.. భగీరథ్ తనకు మిత్రుడేనని.. తాము ఇరువురు స్నేహంగానే ఉన్నామంటూ వీడియో విడుదల చేశాడు. తమ మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించేందుకే దాడికి సంబంధించిన పాత వీడియోను బహిర్గతం చేశారని పేర్కొన్నాడు.