టీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్రపతి రామ్ నాథ్ ప్రసంగాన్ని బహిష్కరించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని టీఆర్ఎస్ నేతలు నాడు గవర్నర్ ను అవమానించారని.. ఇప్పుడు రాష్ట్రపతిని అవమానించారని విమర్శించారు. ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ గవర్నర్ ప్రసంగంలో తమ సంవత్సర కాలం అభివృద్ధి గురించి చెబుతారా..? లేక ప్రతిపక్షాల గురించి చెబుతారా..? అని అడిగారు బండి. ఈ కనీస జ్ఞానం లేని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వారి ఎంపీలను రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని ఆదేశించడం నియంతృత్వ ఆలోచనలకు అద్దం పడుతోందని విమర్శించారు.
గవర్నర్ ప్రసంగం, రాష్ట్రపతి ప్రసంగాలను బహిష్కరించడం వల్ల తెలంగాణకు ఒనగూరే కొత్త ప్రయోజనమేమీ లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సెటైర్లు వేశారు సంజయ్. గత సంవత్సర కాలంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని, సాధించిన విజయాలను రాష్ట్రపతి స్పష్టంగా వివరించారని చెప్పారు.
దేవుడు వరమిచ్చినా.. పూజారి వరమివ్వడు అన్న చందంగా తెలంగాణ ప్రజల పరిస్థితి ఉందన్నారు బండి. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం.. కేంద్రం ఇస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు అందించేందుకు సహకరించాలని చెప్పారు. లేకుంటే తెలంగాణ ప్రజల పక్షాన బీజేపీ పోరు ఆగదని హెచ్చరించారు.