– కేసీఆర్ కు బండి లేఖ
– రెవెన్యూ సదస్సులో చర్చించాలి
– పట్టాలు త్వరగా ఇవ్వాలని డిమాండ్
జులై 15 నుండి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘‘రెవెన్యూ సదస్సులో’’ పోడు రైతులకు హక్కు పత్రాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు. పోడు భూముల సమస్య కేవలం రెవెన్యూ శాఖకే పరిమితమైంది కాదని.. అటవీ శాఖతో కూడా ఈ సమస్య ముడిపడి ఉందని గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ సందస్సులో అటవీ శాఖను కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు.
బీజేపీ, ఎంపీ సోయం బాబురావు పోడు రైతులకు హక్కు పత్రాలివ్వాలని జిల్లా కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు అనేక వినతిపత్రాలు ఇవ్వడంతోపాటు, అనేక ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు బండి. బిజెపి చేసిన పోరాటాలకు తల వొగ్గి రాష్ట్రప్రభుత్వం పోడు భూముల పట్టాలకోసం ధరఖాస్తులు స్వీకరించే కార్యక్రమానికి నవంబర్ 2021లో శ్రీకారం చుట్టిందన్నారు.అయితే.. ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభించలేదని తెలిపారు.
పోడు భూముల సమస్య పరిష్కారానికి వివిధ సందర్భాల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలని, ప్రకటనలను లేఖలో పేర్కొన్నారు సంజయ్. రాష్ట్ర యంత్రాంగాన్ని అంతా తీసుకుని వచ్చి గిరిజనులకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని 2019 జులైలో కేసీఆర్ హామీ ఇచ్చారు. నవంబర్ 23, 2018న మహబూబాబాద్ బహిరంగసభలో అవసరమైతే కుర్చీవేసుకుని మరీ పోడు రైతులకు పట్టాలు అందజేస్తామని అన్నారు. ఈ విషయాలు గుర్తు లేకపోతే కావాలంటే అప్పట్లో వచ్చిన మీడియాలో వార్తలను పంపుతామని సెటైర్లు వేశారు బండి. కేసీఆర్ కుర్చీ వేసుకుని గిరిజనులకు, ఆదివాసీలకు పట్టాలు ఇప్పించడానికి సిద్ధమైతే బిజెపి తెలంగాణ శాఖ, గిరిజనులు, ఆదివాసీలు కుర్చీలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
‘‘గిరిజనులకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని స్వయంగా కేసీఆర్ పర్యవేక్షించకపోయినా, కుర్చీ వేసుకుని పట్టాలు ఇప్పించకపోయినా పర్వాలేదు. కనీసం జులై 15 నుండి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో పోడు రైతులకు హక్కుపత్రాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటే అదే పదివేలు. ఈ చర్య గిరిజనులు, ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. రెవెన్యూ సదస్సుల్లో పోడు రైతులకు హక్కుపత్రాలు ఇచ్చి గిరిజనులు, ఆదివాసీల సంక్షేమం పట్ల మీకు వున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చైర్మన్ గా, అటవీ, రెవెన్యూశాఖ మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఉత్సవ విగ్రహంగా మిగిలిపోయింది. రాష్ట్రప్రభుత్వం 8 నవంబర్ 2021 నుండి 8 డిసెంబర్ 2021 వరకు పోడు సాగుదారుల నుండి ధరఖాస్తులు స్వీకరించిన విషయం మీకు విధితమే. మాకున్న సమాచారం ప్రకారం పోడుభూముల పట్టాలు ఇవ్వాలని కోరుతూ గిరిజనులు, ఆదివాసీలు దాదాపు మూడున్నర లక్షల మంది ధరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకు ఎంతమంది గిరిజనులు, ఆదివాసీలు పోడు భూముల పట్టాలకోసం ధరఖాస్తు చేశారో రహస్యంగా ఉంచుతోంది. గిరిజనులు, ఆదివాసీల నుండి పట్టాల కోసం ధరఖాస్తులు స్వీకరించి ఏడు నెలలు మించిపోయినా ఇప్పటివరకు వాటికి అతీగతీ లేదు. గ్రామసభల ద్వారా స్వీకరించిన ధరఖాస్తులను పరిశీలించడానికి ఇంకా ఎంత సమయం కావాలి?’’ అని లేఖలో ప్రశ్నించారు సంజయ్.
కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం అడవిపై, అటవీ ఫలాలపై, పోడు భూములపై గిరిజనులకు పూర్తి హక్కులున్నాయని గుర్తు చేశారు. చట్టపరంగానే గిరిజనులకు ఉన్న హక్కులను ప్రభుత్వం కాలరాయడం క్షమించరాని నేరమని… పోడు భూములకు పట్టాల కోసం ఒకవైపు ఆందోళనలు జరుగుతుండగా మరోవైపు హరితహారానికి ఫారెస్ట్ అధికారులు సన్నాహం చేయడం ఏంటని నిలదీశారు. ప్రభుత్వ చర్యల వలన గిరిజన ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకునే ప్రమాదం ఉందన్నారు. ఇటువంటి చర్యల వల్ల గిరిజనులకు, ఫారెస్టు అధికారుల మధ్య గొడవలు తలెత్తుతాయని వివరించారు. గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి ప్రభుత్వం జైలుకు పంపుతోందని.. అడవికి వారు హక్కుదారులని చెప్పారు. పోడు భూముల జోలికి ప్రభుత్వం వస్తే వారు సహించరని అన్నారు.
రాష్ట్రప్రభుత్వం పోడు భూములు సాగుదారుల నుండి ఎన్ని లక్షల ఎకరాలపై, ఎంతమంది ధరఖాస్తు చేసుకున్నారో జిల్లాలు, మండలాలు, గ్రామాలవారీగా జాబితాను రెవెన్యూ సదస్సుల కన్నా ముందే ప్రకటించాలని డిమాండ్ చేశారు సంజయ్. ఆ ధరఖాస్తులను రెవెన్యూ సదస్సులో పరిశీలించి హక్కు పత్రాలు ఇవ్వాలని, పోడు భూముల్లో హరితహారం కార్యక్రమాన్ని విరమించుకోవాలన్నారు. అలాగే.. రెవెన్యూ సదస్సులో పోడు భూముల సమస్య పరిష్కారం కోసం అటవీశాఖను కూడా భాగస్వామ్యం చేయాలని.. ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు అటవీ, పోలీస్, రెవెన్యూశాఖల అధికారులు జోక్యం చేసుకోకూడదని చెప్పారు. దాడులను నిలిపివేయాలని, పోడు భూముల సమస్యపై పోరాడుతున్న గిరిజనులు, ఆదివాసీలపై బనాయించిన తప్పుడు కేసులను ఉపసంహిరించుకోవాలని బిజెపి తెలంగాణశాఖ తరుపున డిమాండ్ చేశారు బండి సంజయ్.