పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ అమలు చేయడంతోపాటు వారి సర్వీస్ ను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర చాలా కీలకమైందని గుర్తు చేశారు.
పారిశుద్ధ్యం, హరితహారం, పన్నుల సేకరణ మొదలు దోమల నివారణ దాకా పంచాయతీ కార్యదర్శుల సేవలు మరువలేనివన్నారు బండి. వారిపై నిత్యం అధికార పార్టీ గూండాల దాడులు జరుగుతున్నాయని.. ఇది బాధాకరమని విమర్శించారు. అలాగే ఉన్నతాధికారుల వేధింపులు కూడా ఎక్కువగా ఉండడం దారుణమన్నారు.
పంచాయతీ కార్యదర్శుల్లో మనోధైర్యం నింపి ఉద్యోగ భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు సంజయ్. కచ్చితమైన పని గంటల నిర్ణయించడంతోపాటు వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మొత్తం 12,765 గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలన్నారు బండి. వారు నిత్యం అవమానాలు, బెదిరింపులను భరిస్తూ పని చేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. కొన్నిచోట్ల ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్న సంఘటనలను చూస్తున్నామని సీఎంకు లేఖలో వివరించారు బండి సంజయ్.