వరి వేస్తే ఊరే అని చెప్పిన ముఖ్యమంత్రి చేతే వడ్లు కొనిపించేలా చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. యాసంగి వడ్లు కొంటామని కేసీఆర్ ప్రకటన చేయడం బీజేపీ పోరాటం వల్లేనని తెలిపారు. కేసీఆర్ మెడలు వంచైనా ధాన్యం కొనిపిస్తామని ముందు నుంచి చెబుతూనే ఉన్నామని.. అన్నట్లుగా చేసి చూపించామని చెప్పారు. ధాన్యం కొను లేదంటే గద్దె దిగు అని బీజేపీ సీటు కుంద పొగ పెట్టేసరికి.. సెగ గట్టిగా తగిలి.. ఉన్న కుర్చీ పోతుందేమోనని భయపడి కేసీఆర్ ధాన్యం కొంటామని ప్రకటించారని సెటైర్లు వేశారు బండి.
ఇది ముమ్మాటికీ బీజేపీ విజయమేనని.. రైతులు తిరగబడతారనే భయంతో కేసీఆర్ దిగొచ్చారని విమర్శించారు. రైతుల కోసం బీజేపీ కార్యకర్తలు రక్తం చిందించారని.. ధర్మం కోసం తాము పోరాడామన్నారు. చెప్పినట్టే కేసీఆర్ గల్లా పట్టి ధాన్యం కొనిపిస్తున్నామని సంజయ్ అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు మాటకు మాట బదులిచ్చారు బండి. సీఎం అబద్ధాలు చెబుతున్నారని ఫైరయ్యారు.
ఇప్పటికే తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు సంజయ్. తాను కొంటానన్నా కూడా బీజేపీకి క్రెడిట్ పోతుందన్న భయం కేసీఆర్ ముఖంలో కనిపించిందని ఎద్దేవ చేశారు. కేంద్రాన్ని బద్నాం చేస్తే ఏమొస్తుందని.. తాము సహకరిస్తామని ఎప్పటి నుంచో చెబుతున్నామన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయించినా తాము వెనక్కి తగ్గలేదన్నారు. కనీస మద్దతు ధర రూ.1960కి కొంటామని కేసీఆర్ చెబుతున్నారని.. ఆ ధర కేంద్రం చెల్లిస్తున్నదేనని గుర్తు చేశారు.
అబద్ధాలతో కేసీఆర్ రాజ్యమేలుతున్నారని రాష్ట్రమంతా ప్రచారం జరుగుతోందన్నారు బండి. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పామని… ఎఫ్‌సీఐ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని అందరికీ తెలిసిపోవడంతో భయపడి ముఖ్యమంత్రి దిగొచ్చి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించారని విమర్శించారు బండి సంజయ్.