నిర్మల్ బాలికపై టీఆర్‌ఎస్ నేత అత్యాచారం చేసిన ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. మాయ మాటలు చెప్పి బాలికను హైదరాబాద్ తీసుకొచ్చి అత్యాచారానికి పాల్పడ్డ మానవ మృగం నిర్మల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ షాజీద్ ఖాన్ ను ఇంతవరకు అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. టీఆర్ఎస్ పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని… బాలికలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు.
బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టి మూడురోజులైనా నిందితుడ్ని అరెస్టు చేయకపోగా దోషిగా తేలితేనే పార్టీ నుండి బహిష్కరిస్తామనడం సిగ్గు చేటన్నారు బండి. టీఆర్ఎస్ నేతల తీరును చూస్తుంటే అరాచకాలను సమర్ధిస్తుందని అర్ధమవుతోందని చెప్పారు. ఆనాడు రజాకార్లు మహిళలను చెరెబడుతుంటే నిజాం రాజు మౌన పాత్ర వహించినట్లుగానే ఈనాడు టీఆర్ఎస్ నేతలు బాలికలను, మహిళలపై పడుతుంటే.. నయా నిజాం కేసీఆర్ ప్రేక్షక పాత్ర పోషిస్తుండటం హేయనీయమని ఆగ్రహించారు.
షాజీద్ ఖాన్ ను పార్టీ నుండి బహిష్కరించే సాహసం చేయలేకపోవడం అత్యంత దారుణమన్న బండి… నేటి నయా నిజాం పాలనకు ఇదే నిదర్శనమని అన్నారు. టీఆర్ఎస్ పాలనలో వెలుగు చూసిన ఇలాంటి సంఘటనలు కొన్ని మాత్రమేనని… బయటకు రానివి కోకొల్లలని ఆరోపించారు. గతంలో హైదరాబాద్ నడిబొడ్డున చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోంమంత్రి నివాసానికి సమీపంలోనే దళిత మహిళపై ఎంఐఎం నేత అత్యాచారం చేస్తే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించి కేసు కూడా నమోదు చేయలేదన్నారు.
“కేసీఆర్ మార్క్ నూతన రాజ్యాంగం అంటే ఇదేనేమో.. కల్వకుంట్ల రాజ్యాంగానికి అభం శుభం తెలియని బాలికలు బలవుతున్నారు. అంబేద్కర్ రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పనిచేయాల్సిన పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలకు భయపడుతుండటం బాధాకరం. పోలీసులు అధికార పార్టీ రాక్షస క్రీడలో భాగం కావొద్దని కోరుతున్నా. తక్షణమే బాధ్యుడిని అరెస్టు చేయాలి. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఇకనైనా అంబేద్కర్ రాజ్యాంగానికి లోబడి పనిచేయండి. ఉద్యోగ ధర్మాన్ని పాటించండి. కేసీఆర్ పాలనలో టీఆర్ఎస్ రజాకార్లు దౌర్జన్యాలు, లైంగిక దాడులతో రెచ్చిపోతున్నారు. ఇట్లాగే వ్యవహరిస్తే నిజాంకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుంది. ఆనాడు రజాకార్ల నుండి తెలంగాణ మహిళలను రక్షించినట్లుగానే ఈనాడు తెలంగాణ ప్రజలు కేసీఆర్ నియంత పాలనను తరిమి తరిమి కొట్టడం ఖాయం” అని మండిపడ్డారు బండి సంజయ్.