– పొలం దగ్గర ఫ్రీ సరే..
– ఇంటికాడ కరెంట్ బిల్లుల సంగతేంటి?
– ఉచిత కరెంట్ అంతా బోగస్
– డిస్కంలకు రూ.60 వేల కోట్ల బకాయి
– ఆ భారమంతా వచ్చే ప్రభుత్వంపైనే
– అది చెల్లించేది కూడా బీజేపీనే..
– ఫాంహౌస్ లో నీళ్ల కోసం వేల కోట్ల ఖర్చు
– ఆర్డీఎస్ కోసం పైసలెందుకు ఖర్చు పెట్టరు?
– గ్రామాల్లో అభివృద్ధి పథకాలన్నీ కేంద్ర నిధులతోనే..
– ఝూటా మాటల కేసీఆర్ ను నమ్మకండి
– టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కండి
– రెండో రోజు పాదయాత్రలో బండి పిలుపు
కరెంట్ ఛార్జీల పెంపుతో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నడ్డి విరుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మండిపడ్డారు. వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ.. ఇళ్లకు కరెంట్ ఛార్జీలను పెంచి ఏటా రూ.6 వేల కోట్లు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. వచ్చే నెలలో కరెంట్ బిల్లులను చూసి ప్రజలకు షాక్ కొట్టడం ఖాయమన్నారు. పెంచిన కరెంట్ ఛార్జీలను ఉపసంహరించుకునేదాకా బీజేపీ ఉద్యమిస్తుందని చెప్పారు. తమ పార్టీ చేపట్టే ఈ పోరాటంలో ప్రజలంతా చేయి చేయి కలిపి కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బండి.. రెండో రోజు లింగన్ వాయి గ్రామంలో రచ్చబండ సందర్భంగా మాట్లాడారు.
వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తున్నానని కేసీఆర్ చెబుతున్న మాటలన్నీ పచ్చి అబద్దాలేనని అన్నారు. కరెంట్ సరఫరా చేస్తున్న విద్యుత్ సంస్థలకు కేసీఆర్ ఫ్రభుత్వం రూ. 60 వేల కోట్ల బకాయి పడిందని చెప్పారు. రాష్ట్రాన్ని దివాలా తీయించి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్న కేసీఆర్ డిస్కంలకు బకాయిలు చెల్లించే పరిస్థితిలో లేరని ఆరోపించారు. రాబోయే ప్రభుత్వంపైనే ఈ భారమంతా పడబోతోందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం పతనం ఖాయమని, బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని జోస్యం చెప్పారు. బీజేపీ అధికారంలోకి రాగానే డిస్కంలకు బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. కాబట్టి వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చేది టీఆర్ఎస్ కానేకాదని, బీజేపీ మాత్రమేనన్న సంగతి ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు.
‘‘కరెంట్ చార్జీల పెంపుతో ఆగ్రహంతో ఉన్న ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ ప్యాడీ ప్యాడీ అనుకుంట ఢిల్లీకి పోయిండు. ఆర్టీసీ చార్జీలు రెండుసార్లు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నడు. అందుకే పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకునేదా బీజేపీ ఉద్యమిస్తుంది. ప్రజలంతా చేయి చేయి కలిపి కదం తొక్కాలని కోరుతున్నా. రాజోలి బండ డైవర్షన్ స్కీం నీళ్లు అలంపూర్ కు ఎందుకు రావు. వేల కోట్లు ఖర్చు పెట్టి ఫాంహౌజ్ కు నీళ్లు మళ్లించుకున్నడు. ఆర్డీఎస్ ద్వారా ఇక్కడి పేద ప్రజల పొలాలకు నీళ్లు ఇవ్వాలని ఏళ్ల తరబడి మొత్తుకుంటున్నా రూపాయి ఖర్చు పెట్టలేదు. లింగనవాయి గ్రామంలో రామాలయం గుడి కట్టిస్తామని బడాయి కొట్టిన స్థానిక టీఆర్ఎస్ నాయకులు ప్రజలను నమ్మబలికారు. కాని, ఇంతవరకు గుడి కట్టిన దాఖలాలు లేవు. బీజేపీ అధికారంలోకి రాగానే రామాలయ నిర్మాణాన్ని మేం కట్టి చూపిస్తాం. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఈ ఆలయానికి వచ్చేలా అభివృద్ధి చేస్తాం’’ అని చెప్పారు బండి.
తెలంగాణలోని పల్లెల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ప్రజలు అవసరమైన వాటిన్నింటినీ నెరవేరుస్తున్న ప్రభుత్వం కేంద్రమేనని వివరించారు. మరుగుదొడ్డి మొదలు వంట గ్యాస్ సిలిండర్, కరోనా వ్యాక్సిన్ సహా అన్నీ సమకూరుస్తున్న ప్రభుత్వం మోడీదేనని తెలిపారు. గ్రామంలో నిర్మించిన రోడ్లు, స్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలతోపాటు ఉపాధి పథకం హామీ నిధులన్నీ కేంద్రం ఇచ్చేవేని చెప్పారు. అలాగే పేదలకు అందించే ఉచిత రేషన్ బియ్యానికి అయ్యే సొమ్మంతా చెల్లించేది కేంద్రమేనని… అయినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం సిగ్గు లేకుండా కేంద్ర పథకాలను తమవిగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు.
‘‘టీఆర్ఎస్ పాలనలో పేదలు, యువత, సబ్బండ వర్ణాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. పేదలకు ఇండ్లు రానియ్యడం లేదు. కాని.. కేసీఆర్ కుటుంబంలో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు. రాష్ట్రంలో బాగుపడింది కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులే. పేదోళ్లు గొర్రెలు, బర్రెలకే పరిమితం కావాలి. ఇదే కేసీఆర్ దురాలోచన. అలంపూర్ లో పేదల బతుకులు దారుణంగా మారాయి. కనీసం 100 పడకల ఆస్పత్రి లేదు. రోగమొస్తే కర్నూలులోని దవాఖానకు వెళ్లాల్సిన దుస్థితి. పేదలకు ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య సదుపాయం కల్పిస్తే కేసీఆర్ మాత్రం అది అమలు చేయకుండా వంచిస్తున్నడు. ఇప్పుడు ఎన్నికల్లేవు. ఓట్ల కోసం మీ వద్దకు రాలేదు. మేం చెప్పే విషయాలపై వాస్తవాలు తెలుసుకోండి. టీఆర్ఎస్ నేతలు వస్తే నిలదీయండి. వచ్చే ఎన్నికల్లో అబద్దాలు చెబుతున్న టీఆర్ఎస్ ను ఓడించండి. బీజేపీకి అధికారం ఇవ్వండి’’ అని ప్రజలను కోరారు బండి సంజయ్.