పాదయాత్రలో ఏ ఊరు వెళ్లినా శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు కనిపిస్తున్నాయని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. విద్యార్థులకు కనీస సౌకర్యాల్లేవని… చివరకు చాక్ పీస్ లకు కూడా డబ్బుల్లేవని ఆరోపించారు. స్వచ్ఛ కార్మికులను రోడ్డున పడేశారని.. ధనిక రాష్ట్రమంటే ఇదేనా అని ప్రశ్నించారు. దేశంలో బహుశా టీచర్లపై కక్ష కట్టిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ దేనని సెటైర్లు వేశారు బండి. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డ్యూటీ నుండి దించేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.
కొత్త టీచర్ పోస్టుల భర్తీకి దిక్కు లేదు.. ఏళ్ల తరబడి డీఎస్సీ నోటిఫికేషన్ల ప్రకటన లేదు.. వారికి ఏళ్ల తరబడి బదిలీల్లేవు.. ప్రమోషన్లు లేవు.. అంతర్ జిల్లాల బదిలీలు అసలే లేవు.. వాళ్లకు రావాల్సిన మెడికల్ బిల్లులు రావడం లేదు.. టీఏ, ఆఫీస్ ఖర్చుల డబ్బులు కూడా సక్రమంగా చెల్లించడం లేదు.. చివరకు ఎన్నికల డ్యూటీలు కూడా వేయడం లేదు.. టీచర్లపై కేసీఆర్ కు ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు బండి సంజయ్. ఇక పాదయాత్రలో భాగంగా చేనేత కార్మికుల వద్దకు వెళ్లిన ఆయన నేతన్నలు పడుతున్న వెతలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.
నిజాం తొత్తులుగా ఉన్న భూస్వాములను తరిమి తరిమి కొట్టడంలో పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ చేసిన పోరు చిరస్మరణీయమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆమె చూపిన తెగువ, ధైర్య సాహసాలు నేటి మహిళలకు ఆదర్శమని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారించి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోందని… ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ మహిళలంతా ఏకమై అవినీతి, నియంత, అరాచక పాలనను కొనసాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 30వ రోజు పాదయాత్ర ప్రారంభానికి ముందు బద్దెనపల్లిలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు బండి. ఈ సందర్భంగా ఐలమ్మ పోరాటానికి, త్యాగాలను స్మరించుకుని కేసీఆర్ పాలనలో మహిళలు పడుతున్న బాధలను ప్రస్తావించారు.
ఆదాయం కోసం కేసీఆర్ ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారిస్తూ మహిళల సంసారాల్లో చిచ్చు పెడుతోందన్నారు బండి. ఊరుకో స్కూల్ ఉండాల్సిన చోట ఊరికో బార్, వైన్ షాపులను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాలమాడుతున్నారని మండిపడ్డారు. సొంత ఇల్లు లేక లక్షలాది కుటుంబాలు దీనావస్థలో బతుకుతున్నాయని, డ్వాక్రా రుణాలు కూడా సక్రమంగా ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. కేసీఆర్ నియంత పాలనలో మహిళలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని, చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మహిళలంతా ఏకమై రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
మిడ్ మానేరు భూ నిర్వాసితులపట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉందన్నారు బండి సంజయ్. వారికి కనీసం నష్టపరిహారం చెల్లించకుండా, ఉపాధి కల్పించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండిని కలిసిన మిడ్ మానేరు నిర్వాసితులు ఆయనతోపాటు పాదయాత్రలో పాల్గొన్నారు. తమ గోడును వినిపించారు. తమ భూములను త్యాగం చేస్తే కనీస పరిహారం, సాయం చేయకుండా రోడ్డున పడేశారని వాపోయారు. వారందరికీ బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు బండి. కేసీఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని.. బీజేపీ ప్రభుత్వం రాగానే తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. బాధితులతో కలిసి ముస్తాబాద్ మండలం బద్దెనపల్లి నుండి పాదయాత్ర చేశారు బండి సంజయ్.
ఆదివారం పాదయాత్రకు వేలాదిగా కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. బండి సంజయ్ తో కలిసి అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగారు. జై బీజేపీ.. భారత్ మాతాకీ జై.. నినాదాలు మార్మోగాయి. బద్దెనపల్లి గ్రామంలో మహిళలు హారతులు పడుతూ బండికి స్వాగతం పలికారు. అక్కడ కొయ్యాడ దేవయ్య కుటుంబాన్ని కలిసి ఆరోగ్య స్థితిగతులను, సమస్యలను అడిగి తెలుసుకుని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు సంజయ్. రామన్న పల్లి గ్రామంలో బీజేపీ నేత కరాటే కళ్యాణి పాదయాత్రలో పాల్గొన్నారు. రామన్నపల్లి గ్రామస్తులు బండి సంజయ్ కు మంగళ హారతులతో స్వాగతం పలికారు. గోల్డ్ స్మిత్ కార్మికుల సమస్యలను బీజేపీ పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.