కేసీఆర్ కుటుంబం ఏం త్యాగాలు చేసిందని తెలంగాణలో రాజ్యమేలుతోందని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 32వ రోజు బెజ్జంకి మండలంలో పాదయాత్ర చేసిన ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. బండితోపాటు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్ కుమార్ చౌహాన్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.
తెలంగాణలో కొత్తగా ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను రోడ్డున పడేసిన కేసీఆర్.. తన కుటుంబంలో మాత్రం ఐదుగురికి కొలువులిచ్చుకున్నారని మండిపడ్డారు బండి సంజయ్. ఇంకెన్నాళ్లు కేసీఆర్ కుటుంబ పాలనను భరించాలి..? టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు విశ్రమించబోనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కు బండి సంజయ్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా మండిపడ్డారు. గులాబీ పార్టీని గద్దె దించే విషయంలో, నష్టపోతున్న రైతుల, నిరుద్యోగ, అణగారిన ప్రజల పక్షాన పోరాడే విషయంలో బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానన్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు ఏకపక్షమేనని చెప్పిన బండి సంజయ్… టీఆర్ఎస్ అక్కడ డిపాజిట్ కోసం కొట్లాడాల్సిందేనని సెటైర్లు వేశారు. భారీ వర్షాల వల్ల టీఆర్ఎస్ హయాంలో ఏడేళ్లుగా రైతులు పంట నష్టపోతూనే ఉన్నారని… అయినా ఇంతవరకు వారికి కేసీఆర్ ప్రభుత్వం సాయం అందించిన పాపాన పోలేదన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసి ఉంటే రైతులకు ఈ గతి పట్టేది కాదని చెప్పారు. రాష్ట్రంలో ఫ్రీ యూరియా ఇస్తానన్న కేసీఆర్ మాట తప్పారంటూ మండిపడ్డారు. తెలంగాణను విత్తన భాండాగారంగా చేస్తానని.. నకిలీ విత్తనాల కేంద్రంగా మార్చారని విమర్శించారు.
కేసీఆర్ నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని అన్నారు బండి. తెలంగాణ కోసం 1400 మంది బలిదానాలు చేస్తే కేసీఆర్ కుటుంబం మాత్రం భోగాలు అనుభవిస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇస్తానని అమలు చేయలేదన్నారు. ఒక్కో నిరుద్యోగికి ఆయన లక్ష రూపాయలు బాకీ ఉన్నారని చెప్పారు. బీజేపీకి భయపడి కాంగ్రెస్ తో కేసీఆర్ మిలాఖత్ అయ్యారని.. బీజేపీ,టీఆర్ఎస్ ఒక్కటేనని దుష్ర్పచారం చేయిస్తున్నారని అన్నారు. బీజేపీ ఏనాడూ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ ఢిల్లీకి పోయి చేసేదేమీ లేదన్న బండి… మోడీ దగ్గరకు పోయి వంగి వంగి దండాలు పెట్టి.. బయటకొచ్చి ఫోజులు కొడతారని విమర్శించారు.