– బీజేపీని గెలిపించండి..మేమేంటో చూపిస్తాం
– నకిలీ విత్తనాల అమ్మకాన్ని అరికడతాం..
– ఆర్డీఎస్ ద్వారా గద్వాల జిల్లాకు నీళ్లిస్తాం
– ఒక్క ఛాన్స్ ఇస్తే.. మార్పు చేసి చూపిస్తాం
– ప్రజాసంగ్రామ యాత్రలో బండి
బీజేపీ అధికారంలోకి వస్తే నకిలీ విత్తనాలు అమ్మేవారిని బొక్కలో తోస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చెప్పారు. నీళ్లు లేక అల్లాడుతున్న గద్వాల జిల్లా అలంపూర్ ప్రజలకు ఆర్డీఎస్ ద్వారా సాగు, తాగు నీరందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 5వ రోజు అలంపూర్ నియోజకవర్గంలోని వేముల గ్రామంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ అబద్దాల పుణ్యమా? అని రాజకీయ పార్టీల నాయకుల మాటలు నమ్మే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శించారు.
తాము ఓట్ల కోసం రాలేదని.. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవన్నారు సంజయ్. యాడికి పోయినా నీళ్ల సమస్యే చెబుతున్నారని.. కాళేశ్వరం నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫాంహౌస్ కు నీళ్లు తెచ్చుకోవడానికి కేసీఆర్ రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. కానీ ఆర్డీఎస్ ద్వారా అలంపూర్ కు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏ ఒక్క రైతు లాభం కోసం వ్యవసాయం చేయడం లేదని.. నకిలీ పత్తి విత్తనాలతో ఈ ప్రాంత ప్రజలు తల్లిడిల్లి పోతున్నారని చెప్పారు.
“మిర్చికి తెగులొస్తే సాయం చేయలేదు. పండిన పంటను అమ్ముకుందామంటే మార్కెట్ లేదు. దళారులకు అమ్మి మోసపోతున్నరు. ఏనాడూ పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వ లేదు. కేసీఆర్ చేసిందేమీ లేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదు. ఛాయ్ అమ్ముకునే పేద వ్యక్తి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక తెలంగాణకు 1.40 లక్షల ఇండ్లు మంజూరు చేశారు. కానీ.. కేసీఆర్ ఒక్క ఇల్లు కూడా కట్టివ్వకుండా నిధులు దారిమళ్లించిండు. కేంద్రం ఇచ్చిన ఇండ్లన్నీ పూర్తి చేస్తే మరో 2 లక్షల ఇండ్లు ఇప్పిస్తానని కేసీఆర్ కు చెప్పినా పట్టించుకోలేదు. ఇండ్లన్నీ పూర్తయితే బీజేపీకి పేరొస్తుందనే అక్కసుతో కట్టివ్వడం లేదు. రేషన్ బియ్యం డబ్బులన్నీ కేంద్రం ఇచ్చేవే. కిలో బియ్యానికి 29 రూపాయలు కేంద్రమే ఇస్తోంది. కేసీఆర్ భరించేది ఒక్క రూపాయి మాత్రమే” అని విమర్శించారు బండి.
కేసీఆర్ కుటుంబంలోని ఐదుగురికి పదవులొచ్చాయి గానీ.. యువకులకు మాత్రం ఉద్యోగాలు రాలేదని మండిపడ్డారు. ఒక్క కుటుంబం కోసమా? తెలంగాణ సాధించుకుంది? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో బలిదానం చేసినోళ్లంతా పేదోళ్లేనని.. ఇప్పుడు రాజ్యమేలుతోంది పెద్దోళ్లని విమర్శించారు. తాను తాను చస్తే పేదోళ్ల రాజ్యమొస్తుందనే ఆశతో పోలీస్ కిష్టన్న, శ్రీకాంతాచారి సహా ఎందరో యువకులు బలిదానాలు చేశారని గుర్తు చేశారు. పేదోళ్ల రాజ్యం కావాలా? పెద్దల రాజ్యం కావాలా? ప్రజలు ఆలోచించాలన్నారు. తెలంగాణలోని గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులకు నిధులిచ్చేది కేంద్రమేనని.. కానీ టీఆర్ఎస్ చేసిందంటూ కేసీఆర్ పచ్చి అబద్దాలతో దుష్ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.
“పేదలంటే కేసీఆర్ కు చులకన. డబ్బులిస్తే ఓట్లేస్తారనే అహంకారంతో ఉన్నారు. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ప్రజలు చెంప చెళ్లుమన్పించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్డీఎస్ నీళ్లిచ్చి తీరుతాం. నెట్టెంపాడు నీళ్లిస్తాం. నకిలీ విత్తనాలు అమ్మేవారిని బొక్కలో వేస్తాం. మళ్లీ నకిలీ విత్తనాలు అమ్మకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడతలో పేదలందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చాం. అమలు చేసి తీరుతాం. పెట్రోల్ ధరలను బీజేపీ పెంచుతోందంటూ కేంద్రాన్ని బద్నాం చేస్తున్న కేసీఆర్.. వ్యాట్ పేరుతో లీటర్ కు రూ.30 తీసుకుంటున్నారు. ప్రజలంతా ఒక్కసారి ఆలోచించండి. ఈసారి బీజేపీని ఆశీర్వదించండి” అని కోరారు బండి సంజయ్.