ఉద్యోగ, ఉపాధ్యాయులు తలుచుకుంటే ఏమవుతుందో కేసీఆర్ తెలుసుకోవాలని హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆన్ లైన్ ద్వారా మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రగతి భవన్ లో కుటుంబంతోపాటు ఉండొచ్చు గానీ.. ఉద్యోగులు మాత్రం వారి కుటుంబాలకు దూరంగా బతకాలా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ సర్కార్ 317 జీవోను సవరించాల్సిందేనని డిమాండ్ చేశారు బండి. ఈ విషయంలో బీజేపీ వెనక్కి తగ్గదని పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. 9 గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో 317 జీవోపై చర్చించకపోవడం దుర్మార్గమన్న ఆయన.. కుటుంబాలను విడదీయొద్దంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
2023లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న సంజయ్.. కేసీఆర్ నిర్ణయాలు చూస్తే ఆయన జాతకం బాగాలేదని అర్థం అవుతోందని సెటైర్లు వేశారు. సీఎం డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధనకు బీజేపీ వ్యతిరేకం కాదని తెలిపారు. మౌలిక వసతులు కల్పించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని హితవు పలికారు.
దేశమంతా ఒకవైపు ఉంటే కేసీఆర్ ఒకవైపు ఉంటారని విమర్శించారు బండి. సీఎం ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకున్నారా? లేదా? అనేది తెలియదన్నారు. ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవాలా? వద్దా? అని ముఖ్యమంత్రి చెప్పరా? అని అడిగారు. వందశాతం వ్యాక్సిన్ వేయడంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయింది అంటే అందుకు కేంద్ర ప్రభుత్వ సహకరమే కారణమన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కొత్త డ్రామాలు ఆడుతున్న కేసీఆర్.. సీఎంల సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.