ప్రగతి భవన్ దగ్గర శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టీచర్లను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఉద్యోగ, ఉపాధ్యాయులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. వెంటనే అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల స్థానికతకు గొడ్డలిపెట్టుగా ఉన్న 317 జీవోను సవరించాలన్నారు బండి సంజయ్. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని మార్చుకోవాలని సూచించారు.
జీవో 317ను వ్యతిరేకిస్తూ ప్రగతి భవన్ ను ముట్టడించారు ఉపాధ్యాయులు. నిరసన తెలుపుతున్న టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత మరికొంత మంది ఉపాధ్యాయులు ప్రగతి భవన్ వైపు కదిలారు. ఇలా దశలవారీగా తమ నిరసనను తెలియజేశారు. దీంతో పంజాగుట్ట దగ్గర నుంచే మోహరించిన పోలీసులు అటువైపు వెళ్తున్న టీచర్లను అరెస్ట్ చేశారు.
రెండు రోజుల క్రితం కూడా ప్రగతి భవన్ దగ్గర టీచర్స్ ఆందోళన చేపట్టారు. కేసీఆర్ ను కలిసి తమ సమస్యను వివరిస్తామని అందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అప్పుడు కూడా వారిని అరెస్ట్ చేశారు పోలీసులు.