తెలంగాణలో పేపర్ లీకేజ్ ఇష్యూ చుట్టూ రాజకీయం నడుస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు, ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద దీక్ష చేపట్టారు బీజేపీ నేతలు.
దీక్ష తర్వాత టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు బండి సంజయ్. అయితే.. పోలీసులు ఆయన్ను అడ్డుకుని అరెస్ట్ చేశారు. బండితోపాటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీజేపీ, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నేతల్ని తీసుకెళ్తున్న వాహనాన్ని కార్యకర్తలు చుట్టుముట్టారు. గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన బండి.. పేపర్ లీకేజ్ ఇష్యూలో అంతా కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దీనిపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దీనికోసం పోరాడుతున్న తమ కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇళ్లల్లోకి వెళ్లి మరీ యువ మోర్కా కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. అమరవీరులకు నివాళి అర్పించేందుకు కూడా పర్మిషన్లు కావాలా? అని అడిగారు.
కేటీఆర్ నిర్లక్ష్యం వల్లే పేపర్ లీకేజ్ అయిందని ఆరోపించారు సంజయ్. గతంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల ఇష్యూలో, ధరణిలో కూడా కేటీఆర్ హస్తముందన్నారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా పట్టించుకోకుండా.. కవిత లిక్కర్ స్కాంలో ఇరుక్కుంటే ఆమె కోసం ప్రభుత్వ పెద్దలు ఢిల్లీకి వెళ్లడమేంటని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ దగ్గర 144 సెక్షన్ ఎందుకు పెట్టారని అడిగారు. నీళ్లల్లో స్కాం.. నిధుల్లో స్కాం.. నియామకాల్లో స్కాం.. ఇదే కేసీఆర్ పాలనలో కొనసాగుతోందని ఆరోపించారు సంజయ్.
పేపర్ లీకేజ్ లో కీలకంగా ఉన్న మహిళ కుటుంబసభ్యులు అంతా బీఆర్ఎస్ లీడర్లేనని అన్నారు. కేటీఆర్ ని దీనికి బాధ్యత వహించి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. చిన్నచిన్న ఆరోపణలు రాగానే ఈటల లాంటి నేతలపై చర్యలు తీసుకునే కేసీఆర్.. ఎన్ని పెద్ద ఆరోపణలు వచ్చినా కేటీఆర్ పై ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. సిట్ వల్ల ఉపయోగం ఏమీ లేదన్నారు బండి సంజయ్. అనంతరం అక్కడి నుంచి టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్తుండగా.. పోలీసులు అందర్నీ అదుపులోకి తీసుకున్నారు.