హైదరాబాద్‌లో వరద సాయం నిలిపివేయాలని తాను లేఖ రాసినట్టు సీఎం కేసీఆర్ ఆరోపించడాన్ని ఖండిస్తూ… చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేద్దామంటూ సవాల్ విసిరిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఉద్రిక్తతల మధ్యే అక్కడికి చేరుకున్నారు. ముందుగా ప్రకటించినట్టుగానే మధ్యాహ్నం 12 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. కేసీఆర్ రాక కోసం మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేచి చూశారు.
వరద సాయం ఆపాలని ఈసీకి బీజేపీ లేఖరాసిందని కేసీఆర్ చెప్పడం బాధాకరమన్నారు బండి. బీజేపీ లెటర్ హెడ్, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపించారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతోనే తనపై అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అబద్ధాల ముఖ్యమంత్రిని ప్రజలు నమ్మొద్దని కోరారు.