80 శాతమున్న హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే బీజేపీ లక్ష్యమన్నారు బండి సంజయ్. మేడ్చల్ లో శివాజీ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉద్వేగభరిత ప్రసంగం చేశారు సంజయ్. ఇక్కడి యువతను చూస్తుంటే.. శివాజీ చేతిలో కత్తిని చూడు.. మేడ్చల్ ప్రజల సత్తా చూడు.. అన్నట్లుగా జోష్ కనిపించిందన్నారు.
హిందూ ధర్మ పరిరక్షణ కోసం శివాజీ పుట్టిన పవిత్ర భారతదేశంలో ఎందుకు పుట్టలేదని విదేశీయులు బాధపడుతుంటే.. ఇక్కడివారు మాత్రం సెక్యూలర్ ముసుగులో ఉండటం బాధాకరమన్నారు బండి. శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు చేసుకోవాలంటే కూడా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి రావడం దురదృష్టకరమని చెప్పారు. రాబోయేది రామరాజ్యమేనని… బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామన్నారు.
12 శాతమున్న వాళ్ల కోసం పనిచేసే వాళ్లు సెక్యూలర్ వాదులైతే… 80 శాతం ఉన్న హిందువుల కోసం పనిచేసే తాము మతతత్వ వాదులం ఎలా అవుతామని ప్రశ్నించారు సంజయ్. తెలంగాణలో రజాకార్ల రాజ్యం, మొఘల్స్ పాలన నడుస్తోందని… ఔరంగజేబు పాలన కావాలా? శివాజీ రాజ్యం కావాలా? ప్రజలు ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మ రాజ్య స్థాపన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని… గల్లీగల్లీలో శివాజీ మహారాజ్ విగ్రహాలను ఏర్పాటు చేయడమే కాదు.. ఆయన స్ఫూర్తిగా హిందూ ధర్మ స్థాపన కోసం పోరాడాలని సూచించారు.
‘‘తెలంగాణలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలన్నా.. అయ్యప్ప దీక్షలు చేయాలన్నా.. శివాజీ, హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించాలన్నా పర్మిషన్ తీసుకోవాలా?. ఈ దుస్థితికి కారణం ప్రశ్నించలేకపోవడమే. హజ్ యాత్రలకు మేం వ్యతిరేకం కాదు. కానీ.. పేద హిందువులకు శక్తి పీఠాలను ఉచితంగా దర్శించుకునే సౌకర్యం ఎందుకు కల్పించడం లేదు? హిందువులై ఉండి దేవుళ్లను కూడా దర్శించుకోలేని దుస్ధితి మనకెందుకు?. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 60 ఏళ్లు దాటిన అర్హులందరికీ ఉచితంగా శక్తి పీఠాలు దర్శించుకునేలా చర్యలు తీసుకుంటాం. ఎంఐఎం సవాల్ ను స్వీకరించి.. పాతబస్తీకి పోయి కాషాయ జెండాను ఎగరేశాం. భారత మాతా కీ జై అని గర్జించాం. ఆ వాతావరణం తెలంగాణ అంతటా రావాలి. ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో పాక్ గెలిస్తే సంబురాలు జరుపుకునేవారిని తరిమి తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. భైంసాలో 12 మంది పేద హిందువుల ఇండ్లను కాల్చేశారు. ఇంత జరుగుతున్నా ఒకే వర్గానికి వత్తాసు పలుకుతూ హిందువులపైనే కేసులు పెట్టి చిత్ర హింసలకు గురిచేస్తుంటే మౌనంగా ఉందామా? నువ్వు ఏ పార్టీ అయినా సరే… నిజమైన హిందువైతే.. ఒక చేతిలో నీపార్టీ జెండా పట్టుకో.. ఇంకో చేతిలో కాషాయ జెండా పట్టుకో.. హిందువు అని గర్వంగా చెప్పుకో. రామరాజ్యం, శివాజీ రాజ్య స్థాపనే బీజేపీ లక్ష్యం. గొల్లకొండ(గోల్కొండ) కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించి తీరుతాం. హిందువులంతా ఒక్కటై ఓటు బ్యాంకుగా మారితే బీజేపీ ఎందుకు అధికారంలోకి రాదో ఆచరణలో చూపించి తీరుతాం’’ అంటూ ప్రసంగించారు బండి సంజయ్.