భువనగిరి నియోజకవర్గంలో బిజెపి తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 4వ రోజు కొనసాగుతోంది. ఇవాళ భువనగిరి నియోజకవర్గం లోని పెద్ద రావులపల్లి నుంచి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర.. గౌస్ కొండ మీదుగా ముక్తాపూర్ వరకు కొనసాగనుంది.
పాదయాత్రకు ముందుగా మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనతో టచ్ లో ఉన్నారని తాను అనలేదనే మాటను గుర్తుచేశారు. అయితే, కొందరు ఈ వ్యాఖ్యలను వక్రీకరించినట్లు వెల్లడించారు. ఎవరు వెళ్లినా కలిసే వ్యక్తి ప్రధాని మోదీ అని… అభివృద్ధి కి సంబంధించిన నిధుల విషయంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మోడీ ని కలుస్తూ ఉంటారని చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది బీజేపీ నేని ధీమా వ్యక్తం చేశారు సంజయ్. ఉప ఎన్నికలు కోరుకున్నదే సీఎం కేసీఆర్… మళ్లీ వాళ్లే ఉప ఎన్నిక ఎవరు కోరుకున్నారని ప్రశ్నించడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వళ్ళించినట్టుందంటూ ఎద్దేవా చేశారు. చికోటి ప్రవీణ్(క్యాసినో) వ్యవహారంలో సీఎం కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు వస్తున్నాయి. నాగార్జున సాగర్, దుబ్బాక, హుజురాబాద్ ఉప్పు ఎన్నికల టైంలో 6 నెలల చొప్పున కేసీఆర్ టైం పాస్ చేసాడు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక పేరుతో మళ్లీ 6 నెలలు టైం పాస్ చేస్తాడంటూ కేసీఆర్ కు చురకలు అంటించారు.
ఇక పాదయాత్రలో భాగంగా భట్టుపల్లి గ్రామానికి చేరుకున్న సంజయ్ కు భట్టుగూడెం గ్రామంలో ప్రజలు స్వాగతం పలికి తమ సమస్యలను చెప్పుకున్నారు. అనంతరం వృద్ధులను పలకరించి పింఛన్ వస్తోందా అంటూ అడిగారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. బిజెపి ప్రభుత్వం వచ్చాక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, భువనగిరి నియోజకవర్గం లోని భట్టుగూడెం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బిజెపిలో చేరగా.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు బండి. పెదరావులపల్లిలో మూసీనది ముంపు బాధితులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్నారు సంజయ్.