బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
తెలుగు రాష్ట్రాల జలవివాదాలపై కేసీఆర్ నోరెందుకు మెదపడం లేదు. కృష్ణా, గోదావరి బోర్డులు నిర్వహించే సమావేశానికి ఎందుకు హాజరు కావడం లేదు..? రాష్ట్ర ప్రభుత్వం వెళ్లి ఉంటే ఏపీ అక్రమ ప్రాజెక్టులను నిలదీసి ఆపే అవకాశముండేది. తెలంగాణకు రావాల్సిన నీటిని పొందే హక్కు ఉండేది. అయినా.. ఆ సమావేశానికి హాజరు కావడం లేదు. ఏపీ సర్కార్ అదనంగా ప్రతీ ఏటా 150 టీఎంసీల నీటిని వాడుకుంటోంది. తెలంగాణకు నష్టం జరిగేలా అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. బోర్డు సమావేశాలకు హాజరై ఉంటే వాటిని ప్రశ్నించి అడ్డుకునే అవకాశం ఉండేది. రాష్ట్రానికి అనుమతి లేని ప్రాజెక్టులకు 6 నెలల్లోనే అనుమతి తెచ్చుకునే వీలుండేది. తెలంగాణకు మేలు జరిగే అవకాశం ఉన్నా ఎందుకు పాల్గొనడం లేదు. ఈ సమావేశానికి హాజరైతే తాను చేసిన అక్రమాలన్నీ బయటపడతాయని కేసీఆర్ కు భయం పట్టుకుంది. జగన్ తో కుమ్కక్కైనట్లు అడ్డగోలుగా దోచుకున్న కమీషన్ల వ్యవహారం జనానికి తెలిసిపోతుందని అనుకున్నారు. ఇష్టానుసారం రూపొందించిన డీపీఆర్ లు, అంచనాల వ్యవహారం బయటకొస్తుందని భయపడుతున్నారు. ఇవన్నీ తెలిస్తే ప్రజలు రాళ్లతో కొడతారనే కేసీఆర్ ఈ సమావేశాలకు వెళ్లడం లేదు. అధికారులను పోనివ్వడం లేదు. పైగా పిట్ట కథలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.
గతంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మిస్తుంటే ప్రశ్నించిన కేసీఆర్… తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. నేను కోరిన తర్వాతే గజేంద్ర షెకావత్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయినా.. ఆ సమావేశానికి వెళ్లకుండా సీఎం కేసీఆర్ ప్రజలకు అన్యాయం చేశారు. పైగా బిజీగా ఉన్నానని చెబుతున్నారు. బహుశా ముఖ్యమంత్రిగా ఉంటూ రోజువారీ షెడ్యూల్ విడుదల చేయని సీఎం.. ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమే. కృష్ణా పరివాహక ప్రాంతం 68 శాతం. దాని ప్రకారం తెలంగాణకు రావాల్సిన నీటి వాటా 555 టీఎంసీలు. కానీ.. ఆనాడు కేసీఆర్ కు సోయి లేక 299 టీఎంసీల నీటిని వాడుకునే పత్రాలపై సంతకం చేశారు. ఆనాటి కేంద్రమంత్రి ఉమాభారతి, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి హరీష్ రావు, జల వనరుల సలహాదారు విద్యాసాగర్ రావు సమక్షంలోనే సంతకం పెట్టారు. ఇది నిజం కాదా..? కేసీఆర్ చెప్పాలి. చివరకు తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీల నీళ్లను కూడా పూర్తిగా వాడుకోలేని దౌర్భాగ్య సీఎం కేసీఆర్.
తెలంగాణకి నెంబర్ వన్ ద్రోహి కేసీఆరే. రాష్ట్రం సాధించుకున్నదే నీళ్ల కోసం. కానీ.. ఆ నీళ్ల విషయంలో ఏపీతో కుమ్కక్కయి తెలంగాణకు తీవ్రమైన ద్రోహం చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లోపాయికారీ ఒప్పందాలతో అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ సోయి తెచ్చుకుని కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశానికి హాజరు కావాలి. ఏపీ అక్రమాలను ఎండగట్టాలి. తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని వివరించి అడ్డుకోవాలి. రాష్ట్ర వాటా నీటిని పొందేలా చర్యలు తీసుకోవాలి.
ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం ఎల్లన్న నగర్ కు చెందిన 19 మంది మహిళలను జైల్లో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆ మహిళల్లో కొందరు బాలింత తల్లులున్నారు. ఈ ముఖ్యమంత్రి పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని ప్రతీ ఎన్నికల ముందు చెప్పి తప్పించుకుంటున్నారు. సీఎంకు నిజంగా కళ్లుంటే ఆ తల్లులు జైలు నుండి బయటకొచ్చే దృశ్యాలు చూడాలి. వాళ్లేమైనా మర్డర్ చేశారా..? లూటీ చేశారా..? లేక మీ అయ్య ఆస్తిని ఏమైనా కొట్టేశారా..? మనసెలా ఒప్పింది..? వాళ్లు పోడు చేసుకునే మహిళా రైతులు. పైగా వాళ్లతో పోలీసులు, జైలు సిబ్బంది వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉంది. కొట్టడం, బాత్రూంలు కడిగించడం అన్యాయం. వాళ్లు శిక్ష పడ్డ ఖైదీలు కాదనే విషయాన్ని గుర్తించాలి. దేశానికి అన్నం పెట్టే మహిళా రైతులు వాళ్లు. ఇప్పటికైనా కేసీఆర్… ఆ తల్లులకు క్షమాపణ చెప్పి వాళ్ల కాళ్లు పట్టుకోవాలి. తక్షణమే వాళ్ల పోడు భూములను వాళ్లకిచ్చేయాలి. ఈ ఘటనకు బాధ్యులందరినీ ఉద్యోగాల నుండి తొలగించాలి. అప్పుడే సీఎం చేసిన పాపం కొద్దిగైనా తగ్గుతుంది. లేనిపక్షంలో వాళ్ల ఉసురు తగలడం ఖాయం. కేసీఆర్ అవినీతిని బయటపెడతాం. జైలుకు పంపుతాం. ఈ విషయంలో మా వ్యూహం మాకుంది. జైలుకు పోతాననే విషయం కేసీఆర్ కు కూడా తెలుసు.