జీవో 317ను సవరించాల్సేందనని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీచర్ల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవాలని.. జీవో కారణంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే 34 మంది టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. జీవో 317కు వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమానికి సిద్ధమవుతోందని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో టీచర్లు పరాయి బతుకు బతకాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రౌడీ మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు సంజయ్. ఓ ఐఏఎస్ అధికారికే రక్షణ లేకుంటే.. సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. ఉద్యోగులు 42 రోజుల పాటు సకలజనుల సమ్మె చేయకుంటే తాను సీఎం అయ్యేవాడిని కాదని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. 317 జీవోతో ఉపాధ్యాయుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయని చెప్పారు. సాటి ఉద్యోగుల పట్ల పోలీసుల తీరు బాధాకరమని.. జీవోపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చిస్తామని వెల్లడించారు.
కేసీఆర్ ను ప్రగతి భవన్ నుంచి బయటకు గుంజుకొచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు బండి. టీచర్ల అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. పోలీసులు కూడా సీఎం కేసీఆర్ బాధితులమేనని గుర్తుంచుకోవాలన్నారు. ఉపాధ్యాయులు తమ జీతాలు అడుక్కునే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. బదిలీలు, ప్రమోషన్లు అంటూ కొత్త డ్రామా షురూ చేశారని.. స్థానికత కోసం ఉద్యమం చేయాల్సిన పరిస్థితి రావడం దారుణమన్నారు. 4 డీఏలు ఎందుకు పెండింగ్ లో పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.
13 జిల్లాల్లో బదిలీలు ఎందుకు ఆపారో చెప్పాలన్నారు సంజయ్. ఈ బదిలీల్లో అక్రమాలు జరుగుతున్నాయని, టాన్స్ ఫర్ల కోసం బీఆర్ఎస్ నేతలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. పైసలివ్వలేదని 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు ఆపారా లేదా అని ప్రశ్నించారు. జీవో 317ను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.