– పబ్ కేసులో పోలీసుల తీరుపై బండి ఆగ్రహం
– అత్యాచారం చేస్తే కళ్లు పీకేస్తానన్న కేసీఆర్ ఎటుపోయారు?
– బీజేపీ ఉద్యమించకపోతే కేసును క్లోజ్ చేసేవాళ్లు
– కేసు నమోదు విషయంలో కావాలనే జాప్యం
– తప్పుదోవ పట్టించేందుకు తొలి ఎఫ్ఐఆర్ లో సూరజ్ పేరు
– సీబీఐ జరిపించాల్సిందేనని డిమాండ్
అమ్నేషియా పబ్ కేసును పోలీసులు పూర్తిగా నీరుగార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ తో కలిసి నాంపల్లి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అత్యాచారం కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ గల్లంతు చేసిన తరువాతే ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు చేశారని అన్నారు. ఘటన జరిగిన రోజు నుండి కేసు నమోదు చేయడంలో పోలీసులు కావాలనే జాప్యం చేశారని తెలిపారు. కేసును తప్పు దోవ పట్టించేందుకు… ఇందులో హిందువు ఉన్నట్లు చిత్రీకరించేందుకు మొదటి ఎఫ్ఐఆర్ లో సూరజ్ అనే పేరు నమోదు చేశారన్నారు. పోలీసులు ఎమ్మెల్యే వాహనాన్ని సర్వీసింగ్ చేసి ఆధారాలన్నీ గల్లంతయ్యాయని నిర్దారణకు వచ్చాకే.. ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు చేయడంతోపాటు నిందితుల జాబితాలో చివరన చేర్చారని చెప్పారు.
బీజేపీ ఉద్యమించడం వల్లే పోలీసులు ఈ మాత్రం స్పందించారని.. లేనిపక్షంలో కేసును మూసేసేవారని పేర్కొన్నారు సంజయ్. ‘‘కేసులో చివరి వరకు ప్రభుత్వం నిందితులను కాపాడేందుకు ప్రయత్నించింది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే దోషులను కాపాడేందుకు కేసును నీరుగార్చారు. బీజేపీ ఆందోళన చేయడంవల్లే పోలీసులు ఈ మాత్రమైనా స్పందిస్తున్నారు. కేసీఆర్ చేతగానితనంవల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. ఫాంహౌజ్ కే సీఎం పరిమితమయ్యారు. గత పక్షం రోజులుగా రోజుకో ఘటన వెలుగు చూస్తున్నా… పోలీసులు, ప్రభుత్వం స్పందించడం లేదు. రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ ఉందా? సీఎం ఉన్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి’’ అని అన్నారు.
ఈ కేసులో పోలీసులు పరస్పర విరుద్దంగా మాట్లాడుతున్నారని.. ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం లేదని డీసీపీ జోయల్ చెప్పినట్లు గుర్తు చేశారు. కానీ.. సీపీ సీవీ ఆనంద్ మాత్రం ఎమ్మెల్యే కొడుకుపైనా కేసు నమోదు చేశామని చెప్పారన్నారు. ఆధారాలన్నీ గల్లంతు చేసిందుకు కారుకు సర్వీసింగ్ చేసింది పోలీసులేనని ఆరోపించారు. పూర్తి కాలయాపన చేసి ఆధారాలు దొరకకుండా నీరుగార్చి నిజమైన నిందితులను చివరి పేరులో చేర్చి చట్టానికి భిన్నంగా వ్యవహరించారని విమర్శించారు. ఈ కేసులో మెజిస్ట్రేట్ ఎదుట బాలిక స్టేట్ మెంట్ రికార్డు చేయాల్సినప్పటికీ సకాలంలో చేయలేదన్నారు.
‘‘ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చి ఆదేశాల మేరకే రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లను కాపాడేందుకు పోలీసులు కేసును నీరుగార్చారు. పైకి మాత్రం నిందితులకు 20 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉందంటూ ప్రజలను నమ్మించేందుకు ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి రాష్ట్రాన్ని పంచుకున్నాయి. ఎంఐఎం నాయకులు అత్యాచారాలు చేస్తుంటే టీఆర్ఎస్ నాయకులు హత్యలు చేస్తున్నారు. 15 రోజులుగా నిత్యం అనేక ఘోరాలు వెలుగుచూస్తున్నాయి. ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందిస్తామని… సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు పసిగడతాయని చెప్పిన కేసీఆర్ కుమారుడు ఇప్పుడేమంటారు? రాష్ట్రంలో అత్యాచారాలు చేస్తే కళ్లు పీకేస్తామన్న కేసీఆర్ ఏమైండు? చూడటానికి కేసీఆర్ కే కళ్లు లేవు… ఇక దోషుల కళ్లేం పీకుతాడు?’’ అంటూ సెటైర్లు వేశారు.
కేసీఆర్ కుటుంబం స్పందిస్తే తప్ప పోలీసులు కదిలే పరిస్థితి లేదన్న బండి… న్యాయస్థానాలు స్పందించి పోలీసులను శిక్షిస్తున్నాయని తెలిపారు. చివరకు పోలీసులు బలవుతున్నా మేల్కోవడం లేదన్నారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం ప్రీ ప్లాన్ కుట్ర అన్న ఆయన… బీజేపీ నాయకులు, లీగల్ సెల్ నాయకుల పోరాటంవల్లే కేసులు నమోదు చేశారని అన్నారు. న్యాయం కోరుతున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టే విషయంపై ఉన్న శ్రద్ద… బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే కేసులు పెట్టడంలో ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు.