మెడికో ప్రీతి మరణంపై అనేక అనుమానాలున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక చంపేశారా? అనే డౌట్స్ ఉండగా.. ట్రీట్ మెంట్ విషయంలోనూ కుటుంబసభ్యులు సందేహాలు వ్యక్త పరిచారు. ప్రతిపక్ష పార్టీలు కూడా అదే అంటున్నాయి. ప్రీతి మృతదేహానికి చికిత్స చేశారని శనివారం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థుల్లో వెయ్యి మంది మధ్యలోనే చదువు వదిలేసి వెళ్లిపోతున్నారని.. 500 మంది చనిపోతున్నారని సీజేఐ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలను గుర్తించారు.
తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆదివారం జనగామ జిల్లా మొండ్రాయిలోని గిర్నితండాలో ఉన్న ప్రీతి నివాసానికి వెళ్లారు సంజయ్. మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రీతి వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిలోనే మృతి చెందిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రీతీది ముమ్మాటికీ హత్యేనని.. శవానికి ట్రీట్ మెంట్ చేసి ఠాగూర్ సినిమా చూపించారని ఆరోపించారు. ప్రభుత్వం నిందితుడ్ని కాపాడే ప్రయత్నం చేస్తోందన్న ఆయన.. ఆధారాలు తారుమారు చేశారని ఆరోపణలు చేశారు. ప్రీతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానిది డెడ్ బాడీలు మాయం చేసే చిల్లర సంస్కృతి అంటూ విమర్శించారు.
ప్రీతి హత్య కేసును సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సంజయ్. ఈ కేసుపై మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. మహమూద్ అలీ పాతబస్తీకే హోంమంత్రి అని కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు రబ్బర్ స్టాంపులుగా మారారని.. సర్కార్ నిర్లక్ష్యంపై సోమవారం మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిరసన తెలుపుతామని తెలిపారు.
మరోవైపు, ప్రీతి కుటుంబాన్ని పరామర్శించాడానికి వెళ్లిన బండి సంజయ్ ను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కాన్యాయ్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తరుఫున ప్రీతి కుటుంబానికి ఏం చేస్తారో చెప్పాలని నిలదీశారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు.