సాయి గణేష్ ఆత్మహత్యకు కారణమైన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఖమ్మంలో సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించారు. సాయి గణేష్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అతని ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సాయి గణేష్ ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ గణేష్ అమ్మమ్మ సావిత్రమ్మ బోరున విలపించింది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పోలీసుల వేధింపులకు తన మనవడు బలయ్యారని కంటతడిపెట్టుకుంది. సాయి గణేష్ కు బీజేపీ అంటే ప్రాణమని, పార్టీ కోసం నిరంతరం కష్టపడే వాడని వివరించింది. సాయి గణేష్ పై 16 కేసులు పెట్టారని, రౌడీషీట్ పెట్టారని వాపోయింది సావిత్రమ్మ. మంత్రి, పోలీసులు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.
సావిత్రమమ్మను ఓదార్చిన బండి సంజయ్ ఈ ఘటనపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి పువ్వాడను బర్తరఫ్ చేసి.. ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ తరపున కొనుగోలు చేసిన ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలను సాయి గణేష్ కుటుంబ సభ్యులకు అందించారు బండి సంజయ్. ఈ కార్యక్రమంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి, గరికపాటి మోహనరావు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్.. పోలీస్ స్టేషన్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అయితే తర్వాత హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సాయి గణేష్ ఆత్మహత్య చేసుకోవడానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఆర్ఎస్ నాయకుడు, కార్పొరేటర్ భర్త ప్రసన్న కృష్ణ కారణమని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సాయి గణేష్ మరణ వాంగ్మూలం ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పువ్వాడ, ప్రసన్న కృష్ణ, త్రీ టౌన్ సీఐ వేధింపులు తట్టుకోలేకే సాయి గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. వారిపై చర్యలు తీసుకోవాలని అతని అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.