నిర్మల్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన కామెంట్స్ పై టీఆర్ఎస్ నేతలు పలు రకాలుగా స్పందించారు. మత విద్వేషాలు రగిల్చేలా మాట్లాడారంటూ ఆరోపణలు చేశారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేశారు. ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు బండి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డారు.
అమిత్ షా వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నించారు బండి.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు జరపడం లేదంటే మత తత్వమా..?
14వందల మంది బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరేలా పాలన జరుగుతోందంటే మత తత్వమా..?
కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది.. ఆ పార్టీ చేతిలో టీఆర్ఎస్ కీలు బొమ్మగా మారిందని అంటే మత తత్వమా..?
నిజాం పాలనలో రజాకార్ల ఆకృత్యాలను చెబితే మతతత్వామా..?
నిర్మల్ లో వెయ్యి మందిని ఒకే చెట్టుకు ఉరి తీశారంటే అది మత తత్వమా..?
మత రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం, టీఆర్ఎస్-మజ్లిస్ లను ఓడించినప్పుడే తెలంగాణకు అసలైన స్వేచ్ఛ లభించినట్లవుతుందని చెప్పిన మాటలు మత తత్వమా..?
అసలు.. మత తత్వ రాజకీయాలు చేస్తున్నది ఎవరంటూ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ది సినిమాలో చూపించిన ‘బీదర్ ఇసుక వ్యవహారమే’.. పైకి చెప్పేదొకటి, లోపల జరిగేదొకటి.. ఢిల్లీకి పోయి చెప్పేదొకటి, జరిగేదొకటని విమర్శించారు. రాష్ట్రానికి వేల కంపెనీలు వచ్చాయని.. తెలంగాణలో పుడితే బాగుండని ఇతర రాష్ట్రాల ప్రజలంతా అనుకుంటున్నట్లుగా కేసీఆర్ చెబుతున్నారన్న బండి… నిజంగా వేల కంపెనీలు వస్తే తోమాలతో సేవ చేస్తానని చెప్పారు. లేదంటే కేసీఆర్ ను ఎత్తుకెళ్లి పక్క రాష్ట్రంలో పడేసి వస్తామన్నారు.
ఒక్క రైతు బంధు ఇచ్చి అన్ని సబ్సిడీలు బంద్ చేసిన నాయకుడు కేసీఆర్ మాత్రమేనని విమర్శించారు బండి. ఇంటికో ఉద్యోగమన్నారు ఇచ్చారా..? భృతి అన్నారు ఇచ్చారా..? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక్కొక్కరి తలపై లక్ష అప్పు ఉందన్నారు. ఇప్పుడు సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు కోసం రూ.6,500 కోట్లు అప్పు తెచ్చారని ఆరోపించారు. ఎల్లారెడ్డి ప్రజలు ఏం పాపం చేశారని ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వలేదని ప్రశ్నించారు. జీతాలే ఇవ్వలేని సీఎం దళిత బంధు ఇస్తారంటే ఎలా నమ్మాలని అన్నారు బండి. 2023 ఎన్నికల్లో పోలింగ్ బూతుల్లో కేసీఆర్ గుండెలు బద్దలయ్యేలా ప్రజలు ఓట్లు వేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అమలవుతున్న ప్రతీ పథకానికి డబ్బులు కేంద్రమే ఇస్తోందన్నారు బండి సంజయ్. ఏమీ ఇవ్వడం లేదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు కదా… మోడీ దగ్గరకు వెళ్దాం.. ఏమీ ఇవ్వలేదని నిరూపిస్తే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ కు సవాల్ విసిరారు బండి సంజయ్. ఒకవేళ కేంద్రమే నిధులిస్తుందని నిరూపిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా..? అని ప్రశ్నించారు. ఢిల్లీకి పోయి వంగి వంగి దండాలు పెడుతున్న కేసీఆర్… బయటకొచ్చి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.
టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని వస్తున్న విమర్శలపై స్పందించిన బండి.. కాంగ్రెస్, ఎంఐఎం నేతలు క్రికెట్ లో ఎక్స్ ట్రా ప్లేయర్ల లాంటి వాళ్లని సెటైర్లు వేశారు. టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసింది, పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్, ఎంఐఎం కాదా అని ప్రశ్నించారు. గొల్లకొండ(గోల్కొండ) మీద కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పారు. ఎన్నికలప్పుడు ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారన్న బండి.. ఆ డబ్బులు తీసుకొని బీజేపీని గెలిపించి టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.