టీఆర్ఎస్ అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపినీ అని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సంగారెడ్డికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో బండి ప్రసంగించారు. టీఆర్ఎస్ పింకీలు కాదు.. మంకీలు అంటూ విమర్శలు చేశారు. ఆ పార్టీ పిచ్చి తుగ్లక్ పార్టీ అంటూ సెటైర్లు వేశారు. ప్రజా సంగ్రామ యాత్రకు జాతీయ నాయకత్వం ఆశీర్వాదం ఉందని చెప్పారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలని అన్నారు బండి సంజయ్. దీనికోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఈ పోరాటంలో జైలుకు పోయాం.. కేసులు పెట్టారని గుర్తుచేశారు. ఈనెల 17న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్మల్ కు వస్తున్నారని.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని ఆయన డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు.
రాజ్యాంగానికి విరుద్దమైన ముస్లిం రేజర్వేషన్ వలన బడుగు బలహీన వర్గాలు.. ముఖ్యంగా బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు బండి సంజయ్. వారి జనాభా పెరుగుదల కారణంగా అణగారిన వర్గాలకు సంక్షేమ పథకాలు అందడం లేదని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలా జనాభా నియంత్రణ చట్టం తీసుకువచ్చే ఆలోచన చేస్తామని తెలిపారు బండి సంజయ్.