తెలంగాణలో భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదం అని ఆయన అన్నారు. సీఎంకు మతి భ్రమించినట్లుందన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించాలని ఆయన అన్నారు.
వరద ముంపు ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన తెలిపారు. వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తే అక్కడి ప్రజలు, బాధితులకు భరోసా కలగాలన్నారు. కానీ కేసీఆర్ వ్యాఖ్యలు జోకర్ ను తలపిస్తున్నాయని చెప్పారు.
గతంలోనూ గోదావరి నదికి ఎన్నో సార్లు వరదలు వచ్చాయని, ఈ సారి కూడా అదే విధంగా జరిగిందని, భవిష్యత్ లో వరదలు రావని కూడా చెప్పలేమన్నారు. కానీ కేసీఆర్ కు మాత్రం ఇవి మానవులు సృష్టించినవిగా కనిపిస్తున్నాయని చెప్పారు. వాటిని విదేశీ కుట్రలుగా సీఎం చెబుతున్నారని, అసలు కుట్రలకే అతి పెద్ద కుట్రదారుడు సీఎం కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు.
ఇంజనీరింగ్ నిపుణుడినంటూ సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారని, ఆయన రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌజ్ వర్షాలకు మునిగిపోయిందన్నారు. మిషన్ కాకతీయలో పేరుతో పూడికలు తీశారని, కరకట్టల నిర్మాణాన్ని విస్మరించడంతో పలు చోట్ల చెరువులు, కుంటలు తెగి వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు విదేశీ కుట్ర పేరుతో మరో డ్రామాను మన ముందుకు కేసీఆర్ తీసుకు వచ్చారని అన్నారు.
ఇప్పటికైనా కేసీఆర్ ఈ పోరంబోకు మాటలాపి వరదలతో నిరాశ్రయులైన వారిని ఎలా ఆదుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ముంపు బాధితుల కుటుంబాలకు రూ.10 వేలు ఇస్తానంటున్నారని, సర్వం కోల్పోయిన బాధితులకు ఆ డబ్బు ఏ మూలకు సరిపోతుంది? అని ప్రశ్నించారు. గతంలో హైదరాబాద్ వరద ముంపు బాధితులకు రూ.10 వేల సాయం చేస్తానని హామీ ఇచ్చి గతంలో వాటిని ఎగ్గొట్టారని సంజయ్ గుర్తు చేశారు.