– ఇది ముమ్మాటికీ రైతులపై కక్ష సాధింపు చర్యే
– అన్నదాతలు తిరగబడటం ఖాయం
– ప్రతి పైసా చెల్లించేది కేంద్రమే!
– చేతనైతే సహకరించు.. లేదంటే ఫాంహౌస్ లో పడుకో..
– కాశ్మీర్ ఫైల్స్ పై ఎందుకంత అక్కసు
– నీది కేడీ నెంబర్ వన్ సినిమా బాపతే కదా!
– రజాకార్ ఫైల్స్, ఓల్డ్ సిటీ ఫైల్స్ చూపిస్తాం
– మోడీ పాలనను ప్రపంచమే కీర్తిస్తోంది
– అయినా.. తిట్టడమే పనిగా పెట్టుకున్నావ్
– కేసీఆర్ కామెంట్స్ కు బండి కౌంటర్స్
యాసంగి ధాన్యం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో డ్రామా ఆడుతూ రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మండిపడ్డారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ దగ్గర మీడియా సమావేశంలో మాట్లాడారు. యాసంగి వడ్ల కొనుగోలు, కశ్మీర్ ఫైల్స్, మోడీ పాలనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ పాలన పట్ల ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే కేసీఆర్ ఇలాంటి డ్రామాలాడుతున్నారని అన్నారు. ఆయన దుకాణం బంద్ అయ్యిందని… రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతి పైసా చెల్లిస్తోంది కేంద్రమేనని.. తెలంగాణ రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చేసేది బ్రోకరిజమేనని ఆరోపించారు. “కేసీఆర్… చేతనైతే బ్రోకరిజం చెయ్.. కమీషన్ తీసుకో… చేతకాకుంటే ఇంట్లో పడుకో… అంతే తప్ప రైతులపై కక్ష సాధింపు చర్యలు మానుకో” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు బండి.
సీఎం కేసీఆర్ కు వయసు మీద పడిందని.. మతి తప్పిందని విమర్శించారు సంజయ్. గంటల కొద్దీ ఏదేదో మాట్లాడుతున్నారని.. తన పాలనపై ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకు రోజుకో కొత్త సమస్యను సృష్టించి దాని ద్వారా జల్సా చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే వడ్ల పేరిట డ్రామాలు షురూ చేశారని ఫైరయ్యారు. సోమవారం కూడా పీయూష్ గోయల్ స్పష్టంగా చెప్పారని.. రా రైస్ కొంటామన్నారని వివరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు బియ్యం సేకరణపై మాట్లాడినా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంత వరకు స్పందించలేదన్నారు. గతంలో ఇచ్చిన బియ్యం కూడా ఇయ్యలేదని క్లియర్ గా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అంచనా లేదని.. విధివిధానాల్లేవని పీయూష్ గోయల్ గతంలోనూ పార్లమెంట్ సాక్షిగా వివరించారన్నారు.
ఇన్నాళ్లు బాయిల్డ్ రైస్ కొనాలని డ్రామాలాడిన కేసీఆర్.. ఇప్పుడు మాటమార్చి వడ్లు మాత్రమే కొనాలని కొత్త డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు బండి. గతంలో ధాన్యం మొత్తం కొనేది తామేనని చెప్పారని.. కేంద్రం గింజ కూడా కొనడం లేదన్నారని తెలిపారు. ఆఖరికి కేంద్రం దగ్గరకు పోయి “భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ ఇవ్వబోం” అని సంతకం చేశారని గుర్తు చేశారు. కానీ.. బయటకొచ్చి కేంద్రం బాయిల్డ్ రైస్ కొనాల్సిందేనని మాట మార్చారని ఆగ్రహించారు. పైగా కేంద్రం మెడమీద కత్తిపెడితే రాసిచ్చానని అబద్దాలు చెబుతున్నారని ఫైరయ్యారు. బాయిల్డ్ రైస్ కొనకుంటే ఇండియా గేట్ దగ్గర వడ్లు పారబోస్తానన్న కేసీఆర్.. అంతకుముందు బాయిల్డ్ రైస్ కొనకుంటే మరి ఆనాడు ఎందుకు పోయలేదు? అని ప్రశ్నించారు. తర్వాత వడ్ల కొనుగోలు కేంద్రాలు మూసేస్తున్నట్లు ప్రకటన చేసి.. ఇప్పుడు కేంద్రమే కొనడం లేదని డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు.
గతంలో వరి వేస్తే ఉరే అని కేసీఆర్ రైతులను బెదిరించారన్నారు బండి. కానీ.. ఆయన మాత్రం ఫాంహౌస్ లో వరి పంట వేసి కోటీశ్వరుడయ్యారని సెటైర్లు వేశారు. రైతులను మాత్రం బికారిని చేస్తున్నారని.. అన్నదాతలు ఇబ్బంది పడుతుంటే రాక్షసానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన లాంటి వ్యక్తి సీఎంగా కొనసాగడం బాధాకరమన్నారు. కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉంది కదా.. ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. వడ్లు మాత్రమే కొనాలని ఇన్నాళ్లూ ఎందుకు చెప్పలేదన్నారు. కేంద్రం అనేకసార్లు మీటింగ్ పెడితే ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదని నిలదీశారు సంజయ్. సీఎం మూర్ఖత్వం వల్ల రైతులు ఇబ్బంది పడుతుంటే ఆయన మాత్రం జల్సా చేశారని విమర్శించారు.
“ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగింది. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలే అక్రమాలకు పాల్పడ్డారని మా దగ్గర సమాచారం ఉంది. దీనిపై సమగ్ర విచారణ ఎందుకు జరపడం లేదు? బియ్యం అక్రమాలపై గతంలో కొన్నిచోట్ల ఫిర్యాదులు వస్తే విచారణ జరిపితే నిజమేనని తేలినా ఎందుకు చర్యలు తీసుకోలేదు. భవిష్యత్తులో ఇలాంటి జరగబోవని కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకున్నావే తప్ప ఎందుకు అక్రమాలను ఆపలేకపోతున్నావ్?. ప్రజలకు నీ కుప్పిగంతులన్నీ తెలిసిపోయాయి. నీపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇగ నీ దుకాణం బందైనట్లే. ఏదో ఒక తికమక చేసి మభ్యపెట్టాలనుకుంటున్నావు. నీ పప్పులుడకవ్. నిన్నెవరూ నమ్మరు. 4 రాష్ట్రాల్లో బీజేపీ గెలవడంతోనే కేసీఆర్ మైండ్ దొబ్బింది. అందుకే నిన్నటిదాకా ముందస్తు ఎన్నికలని ఊదరగొట్టి… ఇప్పుడు ముందస్తు లేదంటూ పారిపోయిండు. పైగా సర్వే రిపోర్ట్ లో 95 సీట్లు వస్తాయని బీరాలు పలుకుతుండు. సర్వే రిపోర్ట్ లో 95 సీట్లు వచ్చింది బీజేపీకి. టీఆర్ఎస్ కు వచ్చేది 5 లేకుంటే. 9 సీట్లే. కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో కేసీఆర్ కు వచ్చిన ఇబ్బందేంటి? అంత అక్కసు ఎందుకు? ఆయనకు నచ్చేది కేడీ నెంబర్ వన్… మోసగాళ్లకు మోసగాడు వంటివే కదా. 370 ఆర్టికల్ వల్ల కాశ్మీర్ లో జరిగిన నష్టమేందో తెలుసుకో. కాశ్మీర్ పండిట్లపై జరిగిన ఉచకోతపై వాస్తవ విషయాలను ప్రజలకు చూపిస్తే… జనం ఆలోచనలో పడితే… దానిని పనికిమాలిన సినిమా అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడతావా? బోధన్ లో 35 మందిపై 307 కింద కేసు ఎందుకు పెట్టారు. సిరిసిల్లలో 25 మంది బీజేపీ కార్యకర్తలపై 307 కేసు పెట్టి ఎందుకు జైల్లో వేశారు. కేసీఆర్ కు బీజేపీని ఎదుర్కొనే దమ్ము లేక పోలీసుల ద్వారా తప్పుడు కేసులు పెట్టి అడ్డుకునే కుట్ర చేస్తున్నారు. మాకు కేసులను ఎట్లా ఎదుర్కోవాలో తెలుసు. ఉద్యమాలు తెలుసు. త్యాగాలు తెలుసు. కేసీఆర్ లాంటి పిరికిపందను ఎట్లా తరిమి కొట్టాలో కూడా తెలుసు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సంజయ్.
Advertisements
మోడీ పాలన యూపీఏ పాలన కంటే అధ్వాన్నమన్న కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. యూపీఏలో కేసీఆర్ మంత్రి అయ్యారని.. సహారా, ఈఎస్ఐ స్కాంల సంగతేంటని ప్రశ్నించారు. అలాంటి స్కాముల పాలన చేయడం మోడీకి చేతగాదన్నారు. యూపీఏ పాలనకు, మోడీ పాలనకు లింకు పెట్టడమంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదని చెప్పారు బండి. మోడీ అద్బుత పాలనను చూసి విదేశాలే కీర్తిస్తున్నాయని గుర్తు చేశారు. పక్కనున్న పాకిస్తాన్ ఫ్రధాని సైతం మోడీ విదేశాంగ విధానం భేష్.. ఆయన పాలన చూసి నేర్చుకోవాలని పొగుడుతున్న సంగతి తెల్వదా? ఆ బుద్ధి కూడా కేసీఆర్ కు లేదా? అని నిలదీశారు. ఉక్రెయిన్ లో భారత విద్యార్థులను యుద్దం ఆపించి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీదన్నారు సంజయ్. విద్యార్థులు చావుబతుకుల మధ్య కొట్లాడుతుంటే ఏ ఒక్కనాడు నోరు విప్పని కేసీఆర్.. ఇప్పుడు తామే కాపాడామని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఏ ఒక్క కుటుంబాన్ని కలవకుండా.. ఓదార్చకుండా రాజకీయం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఫైరయ్యారు. ఉక్రెయిన్ విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని కేంద్రమే భరోసా ఇస్తే… భయపడి ఢిల్లీ నుండి హైదరాబాద్ కు ఫ్లైట్ బుక్ చేసిన నాయకుడు కేసీఆర్ అని సెటైర్లు వేశారు బండి సంజయ్.