కేంద్ర బడ్జెట్ పై ప్రెస్ మీట్ పెట్టి వివాదాస్పద విమర్శలు చేసిన సీఎం కేసీఆర్ కు బీజేపీ నుంచి ఎటాక్ మొదలైంది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ నుంచి ఎంపీ సోయం బాపురావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశానికి విప్లవాత్మక, చారిత్రాత్మకమైన బడ్జెట్ అందించారని మోడీ, నిర్మలా సీతారామన్ కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కేసీఆర్ మాటలపై స్పందిస్తూ.. ఆయన ఇంత నీచపు బతుకు ఎందుకు బతుకున్నడో అర్ధం కావడం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు సీఎం వాడిన భాషను చూసి థూ.. అంటున్నారని.. ఆయనకు పిచ్చి పట్టినట్లుందని సెటైర్లు వేశారు.
‘‘కేంద్రం నీలాంటి మెంటల్ గాళ్ల కోసమే ప్రత్యేకంగా ఈ బడ్జెట్ లో మెంటల్ ఆసుపత్రుల ఏర్పాటు కోసం నిధులు కేటాయించినట్లుంది. గత చరిత్రను తెరమరుగు చేసి సొంత చరిత్రను ప్రజలకు చెప్పుకోవాలని కుట్ర చేస్తుండు. రాజ్యాంగాన్ని తిరగరాయాలట. నీ అక్కసు ఇప్పుడు బయటపడింది. ఇన్ని రోజులుగా నువ్వు నీ కడుపులో దాచుకున్న దారుణం బయట పెట్టుకున్నావు. మహనీయుడు, స్ఫూర్తి ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను దారుణంగా అవమానించినావు. ప్రపంచంలోని గొప్ప ప్రజాస్వామ్య దేశంగా తయారు చేసిన రాజ్యాంగం మనది. ప్రపంచమంతా కీర్తించే రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ను అవమానిస్తావా’’ అంటూ మండిపడ్డారు బండి సంజయ్.
సీఎంలో ఎంతో అహంకారం దాగి ఉందన్న ఆయన.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని డిమాండ్ చేస్తే ఆ మహనీయుడిని అవమానించినట్లేనని చెప్పారు. కేసీఆర్ దళిత ద్రోహి అంటూ విమర్శించారు. రాష్ట్రపతి దళితుడు కాబట్టే ఆయన ప్రసంగాన్ని బహిష్కరించారని.. సీఎం ఏనాడూ అంబేద్కర్ జయంతి, వర్ధంతికి వెళ్లలేదని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తిరగ రాస్తుందని చెప్పింది కేసీఆరే.. ఏనాడైనా తిరగరాశామా? అని ప్రశ్నించారు. దళిత సమాజం సీఎం వ్యాఖ్యలపై స్పందించాలని.. లేకుంటే మూర్ఖంత్వంతో ఇంకా బరితెగించి మాట్లాడతారని అన్నారు.
కేసీఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాల్సిందేనన్న బండి.. తెలంగాణ అంతా ఆయన వ్యాఖ్యలపై చర్చ జరగాల్సిందేనని చెప్పారు. దేశాన్ని ఏ విధంగా విచ్చిన్నం చేయాలని కేసీఆర్ చూస్తున్నారో అర్ధం అవుతోందని మండిపడ్డారు. ఇదంతా కొడుకును సీఎం చేయడానికేనని.. 500 కోట్లు ఇచ్చి ఒకాయనతో సీఎం అగ్రిమెంట్ చేసుకున్నారని ఆరోపించారు. ఆయనే మేధావి కదా.. ఇంకొకరు ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్.. దేశంలోనే పెద్ద అవినీతి పరుడని.. జైలుకు పోవడం ఖాయమన్నారు సంజయ్. అందుకే తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన్ను ఎవరూ కాపాడలేరని విమర్శించారు. తెలంగాణ సమాజం అంతా ఆయన పట్ల కసితో ఉందన్న బండి.. జైలుకు పోతే చప్పట్లు కొట్టే రోజులు రాబోతున్నాయని చెప్పారు. ఇన్నాళ్లూ మోడీ బడ్జెట్ నచ్చింది… ఇప్పుడు మాత్రం నచ్చలేదా? నీ అవినీతిని బయటపెడుతుంటే చెడ్డవాళ్లం అవుతున్నామా? అంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
‘‘నీకు పేదల బడ్జెట్ ఎట్లా నచ్చుతది? నువ్వు నెంబర్ వన్ దేశ ద్రోహివి. చివరకు జర్నలిస్టులను కూడా ఇండ్ల స్థలాల పేరుతో మోసం చేస్తూనే ఉన్నావు. బడ్జెట్ లో రైతుల ప్రస్తావన లేదా.. ఎంఎస్పీ కోసం ఈ ఏడాది 2 లక్షల 37 వేల కోట్లు గోధుములు, ధాన్యం కొనడానికి మాత్రమే బడ్జెట్ లో పెట్టారు. ఇది రైతుల బడ్జెట్ కాదా? రైతులు తెలంగాణలో కోటీశ్వరులు అయితే నీ పాలనలో ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నరు? వడ్ల కుప్పలపై ఎందుకు చనిపోయిండ్రు? కొనుగోలు కేంద్రాలు ఎత్తిసి.. ధాన్యం కొనబోమని చెప్పిన మూర్ఖుడివి నువ్వు? కేంద్రానికి ధాన్యం కొనే ఆలోచన లేకుండా ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఎందుకు కేటాయిస్తుంది. ఫ్రీ యూరియా అన్నవ్.. యాడపోయింది. పండించిన ప్రతి గింజా నేనే కొంటానంటివి. మరెందుకు కొనుగోలు కేంద్రాలు మూసేస్తున్నవ్? పొలిటికల్ గూండా గిరి తెలుస్తుంది… గుడుంబా పోయింది గంజాయి, డ్రగ్స్ వచ్చినాయి. ఈడనే పీకలేనోడివి.. దేశానికి వెళ్లి ఏం పీకుతవ్? 2018 ఎన్నికల తర్వాత సారు-కారు-16 అన్నావు… థర్డ్ ఫ్రంట్ అన్నావు. 317 జీవో పేరుతో ఉద్యోగుల్ని అవమానిస్తున్నావు.. నీ జీవో మంచిదైతే 10 మంది ఉద్యోగులు ఎందుకు సూసైడ్ చేసుకున్నరు? భార్యాభర్తల్ని, పిల్లలను, తల్లిదండ్రులను, కుటుంబాన్ని విడదీసిన మూర్ఖుడివి నువ్వు. సిగ్గు లేకుండా జీవోను సమర్ధించుకుంటావా? థూ.. పైగా నిరుద్యోగులను రెచ్చగొట్టి లాగులు పగలకొట్టండని కించపరుస్తవా? ఇద్దరి మధ్య కొట్లాట పెట్టాలనుకుంటున్నవా? 1.5 లక్షల ఉద్యోగాలిచ్చానడం పచ్చి అబద్దం. కొత్త ఉద్యోగాలిస్తానని ప్రతి ఎన్నికలప్పుడు ఊరిస్తున్నావే తప్ప నోటిఫికేషన్లు ఏవి? ఉద్యోగాలిస్తే.. నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకోవాల్సిన ఖర్మ ఎందుకు వస్తది? నువ్వే పెద్ద మిడతవు. అంతకంటే డేంజర్ మనిషివి నువ్వు’’ అంటూ కేసీఆర్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు బండి సంజయ్.
సీఎంకు కొంచమైనా బుద్ది లేనట్లుందన్న సంజయ్.. అబద్దాలాడితే తిడతారనే సోయి కూడా లేకుండా పోయిందని చురకలంటించారు. ఆయనది నాలుక కాదు.. తాటి మట్ట అని విమర్శించారు. కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ యాడపోయి పడుకున్నరని ప్రశ్నించారు. ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిందెవరు? ఆయన ఉద్దరించేందేంటని నిలదీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాల్లేక పేదలు చచ్చిపోతే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. గుజరాత్ పోయి అక్కడి పథకాలను కాపీ కొట్టిన కేసీఆర్.. వాటి గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందని అన్నారు బండి. ఉపాధి హామీ నిధులు తగ్గించినట్లు చెప్పడం అబద్దమని.. ఉద్యోగాలకు, ఉపాధికి సంబంధం ఏందని అడిగారు. ఉద్యోగాలు రాని నిరుద్యోగులు ఇంకా తట్ట మోసుకుంటూ పని చేయాలని కేసీఆర్ ఉద్దేశంలా కనిపిస్తోందన్నారు.
ఎరువులు ఫ్రీగా ఇస్తా.. అద్భుతాలు సృష్టిస్తానని చెప్పి మూడేళ్లయినా ఎందుకివ్వలేదని నిలదీశారు బండి. కేసీఆర్ ఫక్తు మోసగాడని… జనాలను మోసం చేయడానికే పుట్టారని విమర్శించారు. ‘‘ఎరువులు ధరలు పెంచనేలేదు.. గ్రామీణ ఉపాధి హామీ నిధులు ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. గుజరాత్, మధ్యప్రదేశ్ లో చేస్తున్న పథకాలు చెబుతా.. అమలు చేసే దమ్ముందా? వాళ్ల ప్రజలకు కావాల్సిన అవసరాల మేరకు పథకాలు రూపొందించి అమలు చేస్తరు. ఉత్తర ప్రదేశ్ లో ఏక మొత్తంగా ఒకేసారి రుణమాఫీ చేశారు. చత్తీస్ గఢ్ లో ఏడేళ్ల కిందనే రమణ్ సింగ్ ఆధ్వర్యంలో.. అంతకంటే 12 ఏళ్ల ముందే గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఫ్రీగా ఇస్తున్నం. మేం డిస్కంలకు డబ్బులు కడుతున్నం. మీరెందుకు కట్టడం లేదు? ఎస్సీ, ఎస్టీలకు 40 కోట్ల జనాభా 12,700 కోట్లు కేటాయించారనే అంశంపై… బడ్జెట్ లో వంద రకాల పథకాలుంటయ్. ప్రతీ స్కీంలో దళితులు భాగస్వాములే. మరి 12,700 కోట్ల సంగేతింది? హుజూరాబాద్ లో దళిత బంధు అమలు చేయలేక చేతులెత్తేసినవ్. రైతులకు ప్రధాని క్షమాపణ చెప్పడంపై.. రైతు చట్టాలపై సరిగ్గా వివరణ ఇవ్వలేకపోయానని చెప్పారే తప్ప చట్టాలకు వ్యతిరేకంగా కాదు. యూరియా, ఎరువుల కోసం సబ్సిడీ తగ్గింపుపై.. ఇది రైతు ఫ్రెండ్లీ బడ్జెట్. సేంద్రియ వ్యవసాయం పెంపు, ఆర్గానిక్ ఫార్మింగ్.. డ్రోన్ల ద్వారా ఎరువుల చల్లడం దానివల్ల వ్యయం తగ్గుతుందని చెబుతున్నరు. నరేగా 96 వేల కోట్ల నుండి 73 వేల కోట్ల తగ్గింపుపై.. 2019-20లో 50 వేల కోట్లు.. కరోనా వల్ల అదనంగా రూ.40 వేల కోట్లు పెంచారు. కరోనా తగ్గుముఖం పడుతున్నందున దీనిని 73 వేల కోట్లు.. అంటే గతం కంటే పెంచినం. నీవన్నీ దొంగ లెక్కలు’’ అని కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బండి.
మిషన్ భగీరథ్ ముందు గుజరాత్ వెళ్లి సుజలాం-సుఫలాం పథకం సూపర్ అని ఎందుకు కితాబిచ్చారని కేసీఆర్ ను ప్రశ్నించారు సంజయ్. మిడితల కథపై స్పందిస్తూ.. కేసీఆరే పెద్ద మిడిత అని విమర్శించారు. ఆయన మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందన్నారు. ‘‘హంగర్ ఇండెక్స్ సంస్థ ఎవరిది? ఇచ్చేటోడు ఎవడు? ఎక్కడో అమెరికాలో, యూరప్ లో కమ్యూనిస్టు ఎవడో, ఊరుపేరు లేని వాడు రాస్తే నువ్వు చదువుతున్నవ్. ఈ దేశంలో ఆకలితో ఎవరూ పడుకోవడం లేదు. కరోనా సంక్షోభంలోనూ ఎవరూ ఆకలితో ఉండకూడదని ఫ్రీగా బియ్యం, గోధుములు నిరంతరాయంగా సరఫరా చేస్తున్నం. ఇప్పుడు కరోనా పరిస్థితి లేదు. వాటిని మాత్రమే తీసేసినం. దీనికి బడ్జెట్ తగ్గించినట్లు కథలు చెబుతావా? సేవా రంగం ఆరోగ్య పోటీతో వృద్ధి చెందాలని.. వాటికి ప్రజల సొమ్మును ఖర్చు చేయాల్సిన అవసరం లేదనేది కేంద్ర విధానం. నష్టపోయిన సంస్థలు 50 వరకు ఉంటే… లాభాల్లో ఉన్నవి ఒకటి అరా ఉంటయ్. ఆవాస్ యోజన 80 లక్షల మంది ఇండ్ల నిర్మాణం కోసం రూ.48 వేల కోట్లు కేటాయించినం. నువ్వు చేసిందేమిటి? గత ఏడున్నరేళ్లలో తెలంగాణలో కట్టిన ఇండ్లు 8 వేలు మాత్రమే. లక్షల ఇండ్లు కట్టినవని చెబుతున్నవ్ కదా.. దమ్ముంటే బయటపెట్టు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షల ఇండ్లకు నిధులిచ్చిన మాట వాస్తవం కాదా? నీకు దమ్ముంటే లబ్దిదారుల జాబితాను బయటపెట్టు’’ అంటూ సవాల్ చేశారు సంజయ్.
దేశంలో బ్లాక్ మనీ చాలా ఉంది.. దానిని వెలికి తీయగలిగితే ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేసే అవకాశం ఉందని మాత్రమే మోడీ అన్నారని గుర్తు చేశారు బండి. దీనిపై అడ్డగోలుగా కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశం దాటిన వాళ్లంతా కాంగ్రెస్ హయాంలో స్కాంలు చేసి పారిపోయినోళ్లు… వాళ్లను అరెస్టు చేసి ఆస్తులు సీజ్ చేస్తుంటే భయపడి పారిపోయారని చెప్పారు. కేసీఆర్ ను మాత్రం ఈ దేశం వదిలి పారిపోనీయమన్న బండి.. అరెస్ట్ చేసి జైల్లో పెడతామని హెచ్చరించారు. ఇక ఆర్బిట్రేషన్ సెంటర్ పై సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ… సీజేఐని కూడా వివాదాస్పదం చేసిన ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు. గౌరవప్రదమైన ప్రధానిని, సీజేఐని చౌకబారు విషయాల్లోకి లాగుతారా? ఛీ.. థూ… కేసీఆర్ గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదన్నారు.
నదుల అనుసంధానంపైనా స్పందించిన బండి.. కేసీఆర్ కాళేశ్వరం నుండి కొండపోచమ్మ సాగర్, నల్గొండకు నీళ్లిస్తానన్నారని గుర్తు చేశారు. ‘‘కేంద్ర నిధులతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు మేలు అవుతయ్. కావేరి నుండి వచ్చేవి సర్ ప్లస్ నీళ్లు. తెలంగాణ నీటిని ఒక్క చుక్క కూడా పక్క రాష్ట్రాలకు తీసుకెళ్లం. బుందేల్ ఖండ్ తరహాలో అందరికీ నీళ్లు. 5 వారాలు మాత్రమే అయ్యింది నువ్వు డీపీఆర్ ఇచ్చి.. ఇవ్వగానే చూసి ఓకే అనడానికి ఇదేమీ సినిమా కాదు.. నువ్వు ఎంత ఖర్చు చేసినవ్. దొంగ డీపీఆర్ లు ఇచ్చింది.. నీ సంగతి తేలుస్తం? నదుల అనుసంధానం చేస్తానని మొదటి నువ్వు కూడా చెబుతున్నవ్ కదా.. ఏపీ సీఎంను పిలిచి ఇదే మాట చెప్పినవ్ కదా.. కేంద్రం నిధులతో నదుల అనుసంధానం చేస్తానంటే నీకొచ్చిన నొప్పి ఏంటి? నీ కమీషన్లు పోతాయని భయమా? సంగమేశ్వరం ప్రాజెక్టుకు తెలంగాణ నీళ్లను దోచిపెట్టిన నువ్వు.. కేంద్రంపై మాట్లాడతావా’’ అంటూ ఫైరయ్యారు.
క్రిప్టో కరెన్సీ రకరకాలు.. అందులో డిజిటిల్ రూపీని ప్రమోట్ చేస్తున్నామన్నారు సంజయ్. డిజిటిల్ ట్రాన్సాక్షన్స్ పెరగాలని.. ప్రపంచవ్యాప్తంగా లీగల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నా ట్యాక్స్ లు కట్టడం లేదు.. దీనిని దృష్టిలో ఉంచుకుని 30 శాతం పన్ను విధించామని తెలిపారు. అలాగే 65 వేల టీఎంసీలో గోదావరిలో 2 వేల టీఎంసీలు వాడుకోవాలని మొదటి నుండి చెబుతున్నామని… టిబెట్ గురించి కేసీఆర్ కేం తెలుసని ప్రశ్నించారు. అది చైనాలో భాగం.. ప్రతీరోజు అంతర్జాతీయ సమస్య.. దీనిపై కొట్లాడుతున్నం.. బుడ్డర్ ఖాన్ లెక్క మాట్లాడకు.. నదుల అనుసంధానంపై దేశం చూసుకుంటుందని కేసీఆర్ పై మండిపడ్డారు. జల్ జీవన్ మిషన్ మిషన్ కింద ఈ ఏడాది బడ్జెట్ లో మాత్రమే 60 వేల కోట్లు కేటాయించామని… మొత్తం ఈ స్కీం కింద కేటాయించిన బడ్జెట్ రూ.3.5 లక్షల కోట్లని చెప్పారు. గతేడాది 40 వేల కోట్లు పెట్టామన్న ఆయన.. గత రెండేళ్లలో 7 కోట్ల మందికి తాగు నీరు అందించామని వివరించారు. కనీసం ఈ మిషన్ గురించి తలాతోక తెలవకుండా మాట్లాడారని సీఎంపై మండిపడ్డారు. ఆయన చేస్తే రైటు.. మేం చేస్తే రాంగా? ఇదెక్కడి ద్వంద్వ నీతి? మిషన్ భగీరథను కమీషన్ భగీరథ చేశారని ఆరోపించారు. 10 వేల కోట్లతో అయ్యేది 40 వేల కోట్లకు పెంచి కమీషన్లు దొబ్బొరని విమర్శించారు. పైపుల పేరుతో డబ్బుల దండుకుంది నిజం కాదా? మీ లెక్కనే అందరూ చేస్తారనుకుంటున్నరా అంటూ విరుచుకుపడ్డారు.
ప్రధాని వస్తే తనను ఎవరూ పట్టించుకోరనే ఆక్రోశంతోనే సమతామూర్తి విగ్రహం విషయంలో లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు బండి. తెలంగాణకు నిధుల కేటాయింపుపై.. రాష్ట్రాల వాటాను 32 నుండి 41కి పెంచామని.. సీఎంవన్నీ అబద్దాలేనని అన్నారు. ఆల్రెడీ గత 8 ఏండ్లలో 2.72 లక్షల కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. ‘‘నువ్వు సీఎంగా ఉంటూ… ఇంటర్నేషనల్ సంస్థలొచ్చి ఉద్యోగాలిస్తానంటే వాడు, వీడు అంటూ హేళన చేస్తావా? నీకు టీఎస్ పాస్ కాదు.. సంస్కారం లేదు. సంస్కార పాస్ పెట్టుకో. బెల్టు షాపుల పెట్టి మందు తాగిస్తూ రెవిన్యూ పెంచుకుంటున్నవ్? గుడుంబా, డ్రగ్స్, పేకాట, భూ కబ్జాల్లేవంటవా?.. నీతో సహా పక్కన కూర్చోన్నళ్లంతా భూ కబ్జాదారులే. దళిత బంధు ఎందుకు అమలు చేయడం లేదు? నిధుల కేటాయింపు ఏది? సోషల్ మీడియాలో రోజుకు వందల వేల మంది పోస్టులు పెడుతుంటరు. దానికి బీజేపీకి లింక్ పెడితే ఎట్లా? 317 జీవో విషయంలో, గతంలో సీఎం ఇచ్చిన హామీల అమలు కోసం టీఆర్ఎస్ పై ప్రజలు తిరగబడుతున్నరు. దీనిని దారి మళ్లించేందుకు తెలంగాణ సెంటిమెంట్ తో మరోసారి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుండు. ఉచిత కరెంట్ విషయంలో కేంద్రానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు.. అయితే డిస్కంలకు చేస్తున్న పేమెంట్లను ఎగ్గొడుతూ దివాలా తీయిస్తున్నరు. మీరు ఎంతమంది రైతులకు కరెంట్ ఇస్తున్నరో లెక్క తీసి ఆ సొమ్మును డిస్కంలకు చెల్లించాలే తప్ప దివాలా తీయించొద్దన్నదే కేంద్రం విధానం. మోటార్లు మీటర్లు పెడతామని కేంద్రం ఎక్కడా చెప్పలేదు? ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఉచిత విద్యుత్ అమలవుతోంది’’ అంటూ వివరించారు సంజయ్.
Advertisements
యూపీలో సీట్లు తగ్గుతాయన్న వ్యాఖ్యలపై స్పందించిన బండి.. బీజేపీ ఎక్కడుందంటివి… హుజూరాబాద్ లో , దుబ్బాక, జీహెచ్ఎంసీలో ఎక్కడుందో చూపెట్టామని చురకలంటించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వచ్చేది 5 సీట్లేనని అన్నారు. గూగుల్ లోకి వెళ్లి వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని కొడితే కేసీఆర్ పేరే వస్తుందన్న ఆయన.. దీన్ని ఒప్పుకుంటారా? అంటూ సెటైర్లు వేశారు. కేసీఆర్ భాషను చూసి కుక్కలు, నక్కలు కూడా సిగ్గు పడుతున్నయని మండిపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆలోచించాలని.. సీఎం భాష, అంబేద్కర్ ను అవమానించిన తీరును గుర్తుంచుకోవాలన్నారు. నరేంద్ర మోడీని అప్రదిష్టపాలుజేసే కుట్రలో భాగంగానే కేసీఆర్ నీచమైన, బూతు భాషను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీని బంగాళాఖాతంలో కాదు.. ఆల్రెడీ కేసీఆర్ ను జనం సముద్రంలో విసిరేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్ని దాడులు చేసినా భయపడమన్న బండి.. జైళ్లు తమకు కొత్త కాదని చెప్పారు. ‘‘ఆర్టీసీ కార్మికుల కోసం కొట్లాడితే కొట్టించినవ్… ఉద్యోగుల పక్షాన కొట్లాడితే జైల్లో వేసినవ్. రైతులు, నిరుద్యోగుల తరపున, పోడుభూముల కోసం కొట్లాడితే దాడులు చేయించినవ్… భయపడ్డమా? మేం చావడానికి… త్యాగాలు చేయడానికి సిద్ధమై వచ్చినం’’ అంటూ కేసీఆర్ కు కౌంటర్స్ ఇచ్చారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్న బండి.. పేదలు బతకలేని పరిస్థితిలో ఉన్నారని… ప్రజలను ప్రశ్నించలేని స్థితికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని.. ఆయన జైలుకు పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. సీఎం ఫుల్ డిప్రెషన్ లో ఉన్నట్లు అర్థం అవుతోందని ఆయన చేసిన వ్యాఖ్యలపై మాటకు మాట సమాధానం చెప్పారు బండి సంజయ్.