అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మిలియన్ మార్చ్ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా తొలి సంతకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఇచ్చిన హామీలు.. సీఎం అయ్యాక అమలు చేయకుండా నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు.
నిరుద్యోగుల ఆత్మహత్యలను సీఎం చేసిన హత్యలుగానే బీజేపీ భావిస్తోందని అన్నారు బండి. లక్షా 7వేల ఖాళీలు భర్తీ చేస్తానని కేసీఆర్ నమ్మబలికి నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పారు. బంగారు తెలంగాణ సాధనకోసం అందరం కలిసి మహోద్యమం నిర్మిద్దామని పిలుపునిచ్చారు.
ఇటు.. ధరణి పోర్టల్ ప్రారంభమై రెండేళ్లయినా సమస్యలు మాత్రం తీరలేదన్నారు సంజయ్. సీఎం మాటలకు.. చేతలకు పొంతన లేకుండా పోయిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు, మాజీ సైనికాధికారులు సహా ప్రజలు అనేక కష్టాలు పడుతున్నా చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం భూముల్లో పోడు భూములు, పట్టా, అసైన్డు, ఇనాం భూములెన్ని అనే విషయాలపై ఇంతవరకు స్పష్టం చేయకపోవడం దారుణమన్నారు.
రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే కోసం కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల నిధులు మంజూరు చేసినా.. ఇప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు బండ. కేంద్ర నిధులను దారి మళ్లిస్తూ తన కుటుంబం, బినామీ సంస్థలకు ఉపయోగపడేలా.. ధరణి పోర్టల్ ను తీర్చారని ఆరోపించారు. అసైన్డు భూముల రైతులకు శాశ్వత హక్కులు కల్పించాలని హైకోర్టు రెండు సార్లు తీర్పులిచ్చినా పట్టించుకున్న దాఖలాల్లేవన్నారు. ధరణి పోర్టల్.. ప్రజా సమస్యల పరిష్కారానికా.. వేల కోట్ల రూపాయల విలువైన భూములను దండుకోవడానికా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం స్పందించి.. రెవెన్యూ చట్టాలు, ధరణి పోర్టల్ లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.