సీఎం కేసీఆర్ కు కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ నోటిఫికేషన్ల మీద ఎందుకు లేదని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇంటికో ఉద్యోగం ఇవ్వకపాయే-నిరుద్యోగ భృతి ఏమాయే నినాదంతో ఆయన ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగించారు. నల్ల కండువాతో ముస్తాబాద్ ఐకేపీ సెంటర్ నుంచి గన్నెవానిపల్లి, సేవాలాల్ తండా, అంకిరెడ్డి పల్లె మీదుగా సారంపల్లి వరకు పాదయాత్ర చేశారు.
అంకిరెడ్డిపల్లిలో ప్రసంగించిన బండి సంజయ్.. కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీపావళి వరకు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని.. లేకపోతే నిరుద్యోగులతో మిలియన్ మార్చ్ చేస్తామని హెచ్చరించారు. బంగారు తెలంగాణ కాదు బతుకుదెరువు తెలంగాణ కావాలన్నారు. మీ ఇంటికే ఉద్యోగాలా..? నిరుద్యోగ యువతకు వద్దా..? అంటూ నిలదీశారు. వెంటనే జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే.. 2023 తరువాత మీరే భృతి తీసుకోవాల్సి వస్తుందని సెటైర్లు వేశారు బండి. ఇంటికో ఉద్యోగం హామీ ఏమైంది..? లక్ష ఉద్యోగాల సంగతేంటని ప్రశ్నించారు. క్లబ్ లు, పబ్ ల మీద ఉన్న ధ్యాస జాబ్ ల మీద ఎందుకు లేదని విమర్శించారు. రాష్ట్రంలో టీ హబ్ ద్వారా ఇచ్చిన ఉద్యోగాల కంటే పబ్ లే ఎక్కువ తెరిచారని కౌంటర్లు వేశారు.
ఏడేళ్లలో ఒక్క డీఎస్సీ లేదన్న బండి… కమీషన్ల కోసం 70 వేల జీవోలను మాయం చేస్తారు గానీ.. ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క జీవో ఇవ్వలేరా అంటూ కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు.