టీఆర్ఎస్ సర్కార్ ను ప్రతీ అంశంలో ఇరుకున పెట్టాలని తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. 317 జీవోను వ్యతిరేకిస్తూ ఇప్పటికే పోరాటం సాగిస్తున్న ఆయన.. తాజాగా విద్యార్థుల సమస్యలపై గళమెత్తారు. ప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకార వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే ఇంజినీరింగ్, మెడిసిన్, ఐఐటీ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే వారికి పూర్తిగా ఫీజులు చెల్లించేలా జీవో 18 ని సవరించాలన్నారు. 10 వేల లోపు ర్యాంకు వచ్చిన వారికి మాత్రమే ఫీజులు పూర్తిగా మంజూరు చేస్తూ ఆపై ర్యాంకు వచ్చిన వారికి రూ.35 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ చెల్లించకుండా దాదాపు రూ.3 వేల కోట్లు బకాయిపడిందన్నారు బండి. ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చాలామంది విద్యార్థులు ప్రభుత్వ విధానాలతో ఉన్నత చదువులకు దూరమౌతున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో దాదాపు 14 లక్షల మంది బీసీ విద్యార్థులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సంజయ్. ఫీజులు చెల్లించకపోవడంతో బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు పూర్తి చేసినా యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయని తెలిపారు.