తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తనపై ఫేక్ న్యూస్‌తో మరోసారి ఇబ్బందిపడ్డారు. ఇటీవలే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరద సాయం నిలిపివేయాలంటూ సంజయ్ ఈసీకి లెటర్ రాశారంటూ ఆయనపై టీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేయగా.. దాన్ని ఆయన ఖండించారు. అది ఫేక్ లెటర్ అని, టీఆర్ఎస్ నేతలే సృష్టించారని ఆరోపించారు. తాజాగా మళ్లీ ఆయన పేరుతో ఓ ఫేక్ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైఎస్సార్, చంద్రబాబు, ఆంధ్రా సెటిలర్ల ఓటర్ల గురించి అందులో తీవ్ర పదజాలం దూషించినట్టుగా ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటోను స్వయంగా పోస్ట్ చేస్తూ.. బండి సంజయ్ అధికార పార్టీ టీఆర్ఎస్‌పై తీవ్రంగా మండిపడ్డారు.
‘మొదట ఒక ఫేక్ లెటర్ సృష్టించారు. ఆ తర్వాత ప్రజలతో చీత్కరించబడ్డారు. అయినా వారి బుద్ధి మారలేదు. మళ్లీ ఇప్పుడు ఫేక్ ట్వీట్. ఇవన్నీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి’ అని బండి సంజయ్ ఆరోపించారు.
‘టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా వారి అవినీతిని, అక్రమాలను, కుటుంబపాలనను అంతమొందించడానికి భాగ్యనగర్ ప్రజలు నిర్ణయించుకున్నారు. అసత్య వార్తలతో అడ్డదారిలో గెలవలేరు. ప్రజాభిమానం కోల్పోయిన మీకు ఓటమి తప్పదని’ ఆయన హెచ్చరించారు..
దయచేసి ఈ ఫేక్ న్యూస్ (ట్వీట్) ను, సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. దీన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తోందని బండి సంజయ్ స్పష్టం చేశారు.