ఖమ్మంలో కలకలం రేపిన సాయి గణేష్ మృతి విషయంలో మంత్రి పువ్వాడ, బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జోగులాంబ గద్వాల జిల్లాలో నాలుగో రోజు సంజయ్ ప్రజా సంగ్రామ కొనసాగిస్తున్నారు. అంతకుముందు చండూరు పాదయాత్ర శిబిరం దగ్గర సాయి గణేష్ చిత్రపటానికి నివాళులర్పించారు బండి. ఈ ఘటనలో ఎవరినీ వదిలిపెట్టమన్నారు.
అమాయకులను ఆత్మహత్య చేసుకునేలా టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు సంజయ్. సాయి గణేష్ విషయంలో న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మరణ వాంగ్మూలం తీసుకుంటే స్థానిక మంత్రి, టీఆర్ఎస్ నేతలపై హత్య కేసు నమోదు చేయాల్సి వస్తుందనే భయంతోనే తీసుకోలేదని ఆరోపించారు. సీఎంఓ నుండి వచ్చిన ఆదేశాలతోనే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.
తక్షణమే మంత్రి, పోలీసులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు బండి. బీజేపీ కార్యకర్తలు, యువకుల బాధకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టమని తప్పకుండా శిక్షిస్తామని చెప్పారు.
సాయి గణేష్ చట్టానికి లోబడి పాలకుల అక్రమాలు, దుర్మార్గాలపై న్యాయ బద్ధంగా యుద్ధం చేశాడన్నారు సంజయ్. అలాంటి యువకుడు మన మధ్య లేకపోవడం బాధాకరమని.. టీఆర్ఎస్ నేతలు గూండాయిజానికి పోలీసుల కండకావరానికి సాయి గణేష్ బలైపోయాడని చెప్పారు. నాలుగోరోజు పాదయాత్ర జాలపూర్ శివారు నుండి వాలూర్ వరకు ఉంటుంది.