బెంగ వద్దు మీ వెంట బీజేపీ ఉంటుందని ఆపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రజా సంగ్రామయాత్ర 3వ రోజు పర్యటనలో భాగంగా గుండెగాం చేరుకున్న ఆయన.. పాల్సికర్ రంగారావు ప్రాజెక్టు ముంపు బాధితులను పరామర్శించారు.
ముంపు వచ్చిదంటే తమ ఇళ్ళల్లోకి నీళ్ళు చేరి పాములు, తేళ్ళు, విష పురుగులు, జంతువులకు ఆవాసంగా మారుతోందని వాపోయారు. ప్రతీ ఏడు ఇదేతంతని తమ గూడెం గోడు సంజయ్ తో చెప్పుకున్నారు. ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా స్థానిక నేతలు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేసారు.
తమ పబ్బం గుపుకోవడమే టీఆర్ఎస్ నాయకుల ఎజెండా అని.. మీ బాధలు వారికెలా అర్థమవుతాయని మండిపడ్డారు సంజయ్. బీజేపీ బీదసాదల పార్టీయని మీవెంటే నడుస్తుందని ధైర్యం చెప్పారు. అక్కడ పత్తి రైతులను పలకరించి వారి సాధక బాధకాలను స్వయంగా తెలుసుకున్నారు బండి. కేసీఆర్ కు పేదలంటే మంట అని, కేసులు పెట్టి వేధిస్తూనే ఉంటారని అన్నారు. పేదలకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
త్వరలోనే మీకు మంచి రోజులు వస్తాయని, పత్తి రైతులకు బీజేపీ ప్రభుత్వం ఆదుకుని అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తికాక ముందే చిన్నపాటి వర్షానికే కురుస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో పిల్లల్ని కనాలంటేనే భయపడుతున్నారని, పుట్టబోయే బిడ్డపైనా రూ.1.2 లక్షల అప్పు చేశారని విమర్శించారు. కేసీఆర్ సంగతి చూస్తామని, బీజేపీ అధికారంలోకి రాగానే గుండెగాంను అద్దంలా మెరిపిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడి 250 కుటుంబాలనే కాపాడలేనోడు..తెలంగాణను ఏం కాపాడుతారని విమర్శలు గుప్పించారు.