తెలంగాణలో అసలు సిసలైన రాజకీయం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఏడేళ్లుగా ఏకచ్ఛత్రాధిపత్యం సాగిస్తున్న గులాబీ పార్టీ పునాదులు.. ఒక్కొక్కటిగా కదిలిపోతున్నాయి. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీకి జరిగిన నష్టం టీఆర్ఎస్‌కి చిన్న శాంపిల్ మాత్రమే. ఇన్నాళ్లు అధికార పార్టీ నేతలు చేసిన పాపాలకు శిక్షలు.. ఎదురుదెబ్బల రూపంలో ఎదురుచూస్తున్నాయి. ఇకపై జరగబోయే ఎన్నికల్లో ఆ పార్టీని ఇంతకంటే దారుణమైన దెబ్బకొట్టేందుకు పార్టీలు, ఇతర పకడ్బంధీగా ప్లాన్ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులు, పట్టభద్రులైతే గులాబీ బాస్‌పై బుసలు కొడుతున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తేగానీ తమకు మనశాంతి ఉండదన్నట్టుగా కసిమీదున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలు జరగబోయే పట్టణాల్లో కూడా అదే పరిస్థితి. ఎల్ఆర్ఎస్ మాట విన్నప్పటి నుంచి అక్కడి ఓటర్లు కూడా ఆవేశంతో రగిలిపోతున్నారు. ఇలా ఈ పరిణామాలన్నీ కూడా టీఆర్ఎస్‌ను గట్టిగా తీయబోతున్నాయి.
మరోవైపు ఇన్నాళ్లు రాష్ట్రంలో ప్రశ్నించే ప్రతిపక్షమే లేక కారును హండ్రెడ్‌కు పైగా స్పీడ్‌లో నడిపిస్తూ సోలో పాలిటిక్స్ చేస్తూ వచ్చారు కేసీఆర్. కానీ ఇప్పుడు అంతకు మించిన రెట్టింపు వేగంతో.. కేసీఆర్ వెనకాల ప్రతిపక్షాలు దూసుకొస్తున్నాయి. ఇప్పటికే ఈ రేసులో కారును.. బండి సంజయ్ రూపంలో బీజేపీ ఓవర్‌టేక్ చేసి ఝలక్ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ నుంచి రేపోమాపో రేవంత్ రెడ్డి కూడా రేసులోకి రాబోతున్నారు. దీంతో టీఆర్ఎస్‌కు ముప్పేట దాడి తప్పేలా లేదు. ఇటీవల ఓటర్లు కొట్టిన దెబ్బకు.. ఇప్పటికే ఆ పార్టీ ఉక్కిరి బిక్కిరవుతోంది. ఇప్పటికిప్పుడు జనాన్ని ఆకర్షించేందుకు కొత్త పథకాలేవి తట్టడం లేదు. ఏదైనా మాయ చేద్దామన్నా ఖజానా ఖాళీగా కనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల తర్వాత.. కేసీఆర్ దాదాపుగా సైలెంట్ అయ్యారు. ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఇప్పటికే దుబ్బాకలో ఓటమిపాలై ఇంటి దారిపట్టగా.. గ్రేటర్ ఎన్నికల్లో కేటీఆర్ కూడా పెవిలియన్ చేరారు. అర్జెంట్‌గా ఒక విజయం కావాలి… కానీ అంత సీన్ అయితే కనిపించడం లేదు.
ఏ మాటల దాడితో అయితే ఇన్నాళ్లు కేసీఆర్ రాజకీయాల్లో నెగ్గుకు వచ్చారో.. ఇప్పుడు అంతకంటే పదునైన మాటలతో ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ దూకుడు చూస్తోంటే.. బహుశా కేసీఆర్‌కు తనకు తానే గుర్తుకొస్తారన్న అభిప్రాయాలు ఉన్నాయి. తానే కాదు.. ఇప్పుడు కేటీఆర్‌ని ముందు పెట్టినా వారి స్పీడ్‌ను తట్టుకుంటాడా అన్న సంశయాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. త్వరలో జరిగే వివిధ ఎన్నికల్లో ఓటమిని తప్పించుకోకుంటే.. అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఆర్ఎస్ తెలంగాణ పొలిటికల్ రేసులో మూడో స్థానానికి పడిపోవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.