నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్ వాహనంపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని ఖండించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అరవింద్ కు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. నిజామాబాద్ పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు బండి. సీఎం కేసీఆర్ రజాకార్ లాగా వ్యవహరిస్తున్నారు మండిపడ్డారు.
అన్ని శాఖలను గుప్పిట్లో పెట్టుకుని కేసీఆర్ క్రూరంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు సంజయ్. జిల్లా జిల్లాకు నిబంధనలు మారుతాయా? అని ప్రశ్నించారు. ఎంపీ ఫోన్ చేసినా పోలీసులు స్పందించకపోవడం దారుణమన్నారు.
నందిపేట మండలం చిన్నయానంపల్లిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వెళ్లారు అరవింద్. అయితే.. ఆయన వాహనంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. కారు వెనుక అద్దం పగిలిపోయింది. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అరవింద్ పర్యటనకు అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన ఆర్మూర్ మండలం మామిడిపల్లి దగ్గర రోడ్డుపై ధర్నాకు దిగారు.
తనతో పాటు బీజేపీ కార్యకర్తలను హత్య చేసేందుకు టీఆర్ఎస్ కుట్ర చేసిందని ఆరోపించారు అరవింద్. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి రాడ్స్, కత్తులతో సిద్ధం అయ్యారని అన్నారు. 2 వందల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల పైకి వస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు.
గులాబీ రౌడీలకు పోలీసులు మద్దతు పలుకుతూ అమ్ముడుపోయారని ఆరోపించారు ఎంపీ. పోలీసుల తీరుపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. నియోజకవర్గంలో ఎక్కడైనా పర్యటిస్తానని స్పష్టం చేశారు.