సీఎం కేసీఆర్ అంబేద్కర్ కు ఏనాడూ నివాళులు అర్పించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సంజయ్.. ఎన్నికల సమయంలోనే కేసీఆర్ జై భీమ్.. జై దళితులు అంటారని మండిపడ్డారు.
కేసీఆర్ కు అంబేద్కర్ వర్ధంతి, జయంతి కార్యక్రమాలు గుర్తుకు రావని అన్నారు. ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నారు? ఫాంహౌస్ లో బిజీగా ఉన్నారా? అని మండిపడ్డారు. అంబేద్కర్ వర్ధంతి, జయంతికి కేసీఆర్ ఎందుకు నివాళులు అర్పించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని దళిత ద్రోహి ఏలుతున్నాడని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు బండి. దళిత బంధు, మూడెకరాల భూమి అని అన్ని అబద్ధాలే అంటూ మండిపడ్డారు. అటు, కాంగ్రెస్ పై కూడా బండి సంజయ్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కూడా అంబేద్కర్ ను పట్టించుకోలేదని అన్నారు. అంబేద్కర్ ను భారతరత్న ప్రకటించింది బీజేపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.