– శ్రీలంక తరహాలో కేసీఆర్ కుటుంబ అవినీతి పాలన
– తెలంగాణ ప్రజలు బిచ్చమెత్తుకునే దుస్థితి వద్దు
– బీజేపీ మహోద్యమంలో భాగస్వాములు కండి
– మరో 20 ఏళ్లు దేశంలో బీజేదే అధికారం
– తెలంగాణలోనూ విజయం తథ్యం
– ఉద్యమ ఆకాంక్షల సాధన సభలో బండి
కొంతమంది మూర్ఖులు తెలంగాణ చరిత్రను రూపుమాపాలని చూస్తున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్ నాగోల్ తట్టి అన్నారం జె కన్వెన్షన్ లో నిర్వహించిన అమరుల యాదిలో ఉద్యమ ఆకాంక్షల సాధన సభలో పాల్గొని మాట్లాడారు.
కేసీఆర్ సాగిస్తున్న నిరంకుశ పాలన చూసి.. తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధించుకున్నామా అని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ విషయాలను ప్రజలకు తెలియజెప్పేందుకే ఈ సభను ఏర్పాటు చేశారని తెలిపారు. సీఎం కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో కలపాలని విరుచుకుపడ్డారు.
నిజమైన ఉద్యమకారులు ఉన్న పార్టీ బీజేపీ మాత్రమేనని.. మలిదశ ఉద్యమం చేపట్టి తెలంగాణ ఆకాంక్షలను నెరవేరుస్తామని తెలిపారు. కేసీఆర్ కుట్రతో రాష్ట్రంలో కొత్త తరహా ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. ఉద్యమ ద్రోహులే మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారని ఆరోపించారు. శ్రీలంక తరహాలో కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనతో తెలంగాణ ప్రజలు బిచ్చమెత్తుకునే దుస్థితి ఏర్పడుతుందనడంలో సందేహం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి.
కేసీఆర్ చేసిన ద్రోహాన్ని, మోసాలపై బీజేపీ సాగిస్తున్న మహోద్యమంలో ప్రజలు భాగస్వాములై.. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు.. మరో 20 ఏళ్ల పాటు కేంద్రంలో నరేంద్రమోడీ ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలో ఉండటం ఖాయమన్నారు సంజయ్.